మార్చి 22 నుంచి ఐపీఎల్(IPL 2025) సందడి మొదలుకాబోతుంది. యావత్ క్రికెట్ అభిమానులకు రెండు నెలల పాటు ఫుల్ మజా అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ వేదికల్లో పొగాకు, మద్యం ప్రకటనలు, అమ్మకాలకు సంబంధించిన ప్రకటనలు నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రజారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పొగాకు, మద్యం ప్రకటనలు, సర్రోగేట్ ప్రమోషన్లు, స్టేడియంలు, టెలివిజన్ ప్రసారాల్లో పూర్తిగా నిషేధించాలని బీసీసీఐకి తెలిపింది.
ఐపీఎల్ అనుబంధ ఈవెంట్లు, క్రీడా వేదికల్లో స్మోకింగ్, ఆల్కహాల్ ఉత్పత్తుల ప్రకటనలు నిషేధించాలని కోరుతూ ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐకి హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయెల్ లేఖ రాశారు. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక, నైతిక బాధ్యత వహిస్తూ అలాంటి ప్రకటనలు మానుకోవాలని లేఖలో సూచించారు. ఈ నిబంధలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ జరగనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ప్రారంభం కానుంది.