Yuzvendra Chahal VS Dhanashree Verma: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా తన వ్యక్తిగత జీవితం, విడాకుల అనంతరం ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2020లో ప్రముఖ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్న చాహల్, ఇటీవలే ఆమెతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విడాకుల తర్వాత వచ్చిన పరిస్థితులే తనకు జీవితాన్ని కొత్త కోణంలో చూపించాయని ఆయన వివరించారు.
ఆత్మహత్య ఆలోచనలు…
తనపై వచ్చిన విమర్శలు మొదట్లో తట్టుకోలేనివిగా అనిపించాయని చాహల్ అన్నారు. చాలామంది తనను మోసగాడిగా అభివర్ణించారని, కొన్ని సందర్భాల్లో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పారు. ఈ విడాకులు తన జీవితాన్ని మొత్తం దెబ్బతీశాయని వెల్లడించారు.
ఎప్పటికీ ఎవరి నమ్మకాన్ని..
తనపై వచ్చిన నెగెటివ్ కామెంట్లు, సోషల్ మీడియాలో రాసిన కథనాలు, వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలు తనను చాలా బాధించాయని చాహల్ గుర్తుచేసుకున్నారు. తాను ఎప్పటికీ ఎవరి నమ్మకాన్ని దెబ్బతీయలేదని, ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. తన స్వభావం చాలా నిబద్ధతతో కూడినదని, తనవాళ్లను గౌరవించేలా పెరిగానని తెలిపారు.
మహిళలను గౌరవించటమే..
తనపై మహిళలపై గౌరవం లేదన్న విమర్శలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. తాను ఇద్దరు సోదరీమణులతో పెరిగానని, మహిళలను గౌరవించటమే తనకు తెలిసిన జీవన విధానమని చెప్పారు. అలాంటి దొంగ కథనాలు కేవలం వ్యూస్ కోసం రాసారన్న ఆరోపణలు చేశారు.
ఈ విషాద సమయంలో రోజుకు రెండు గంటల నిద్ర కూడా పోయేవాడిని కాదని, మొదట్లో క్రికెట్‌కి దూరంగా ఉన్నానని, ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోయానని చెప్పారు. దాదాపు ఐదు నెలలపాటు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నానని వివరించారు. ఈ క్రమంలో కొన్నిసార్లు తన ఆత్మీయుల వద్ద ఆత్మహత్య ఆలోచనల గురించి కూడా మాట్లాడానని తెలిపారు.
Also Read: https://teluguprabha.net/sports-news/england-dominates-day-1-at-oval-but-chris-woakes-injured/
అయితే తనకు నిజమైన మద్దతు కలిగినవారు ఉన్నారని చాహల్ చెప్పాడు. కుటుంబ సభ్యుల్ని బాధపెట్టకూడదనే ఉద్దేశంతో తన సమస్యలు ఎక్కువగా స్నేహితులతోనే పంచుకున్నానని చెప్పాడు. ప్రాతిక్ పవార్, ఆర్‌జే మహ్‌వషా వంటి స్నేహితులతో తాను ఎక్కువగా మాట్లాడేవాడినని తెలిపారు. వాళ్ల సపోర్ట్ వల్లే మళ్లీ మామూలు జీవితంలోకి వచ్చానన్నారు.
విడాకుల దశలో తన కెరీర్‌తో వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యంగా నడపడం చాలా కష్టం అయ్యిందన్నారు. ఇద్దరిది వేర్వేరు లక్ష్యాల ప్రపంచమని, భావోద్వేగాలు తగ్గిపోయిన సమయంలో సంబంధం నిలబడడం కష్టమే అవుతుందని చెప్పారు. ఆ సమయంలో సహనం అవసరమని, విడిపోవడం తప్పనిసరి అయిందని తేల్చేశారు.
Also Read: https://teluguprabha.net/sports-news/rain-threat-looms-over-crucial-india-england-5th-test-at-oval/
ఈ అనుభవాల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, జీవితాన్ని కొత్తగా చూడడం ప్రారంభించానని చాహల్ చెప్పారు. ప్రస్తుతం తనతో ఉన్నవాళ్లు, మద్దతుగా నిలిచిన స్నేహితులు తన బలం అని చెప్పారు. ఇప్పుడు మళ్లీ తన ఫోకస్‌ను పూర్తిగా క్రికెట్‌పై పెట్టానని అన్నారు.


