ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy 2025) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. 8 దేశాలు ఈ మెగా టోర్నీ బరిలో ఉన్నాయి. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ కప్ కొట్టేందుకు అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. కరాచీ, లాహోర్, రావల్పిండి మూడు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. అయితే భద్రతాకారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్ వెళ్లడం లేదు. ఈనేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్‌లు అన్ని దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒకవేళ భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరగనుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా జరగనుంది.
ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న ఆడనుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. మరోవైపు ఐసీసీ ప్రమోషల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అధికారిక గీతాన్ని విడుదల చేసింది. “జీతో బాజీ ఖేల్ కే” అంటూ సాగే ఈ పాటను పాకిస్థానీ సింగర్ అతిఫ్ అస్లాం పాడారు.