Team India Siraj reveals PM Modi role: ప్రధాని నరేంద్ర మోదీ మాటలు తమకు ఎంతో ప్రేరణనిచ్చాయని భారత క్రికెట్ స్టార్ మహ్మద్ సిరాజ్ తెలిపారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత మోదీ డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి టీమ్ సభ్యులను ఓదార్చారని సిరాజ్ వెల్లడించారు. ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా.. 2023 ప్రపంచకప్ ఫైనల్ నాటి జ్ఞాపకాలను సిరాజ్ గుర్తుచేసుకున్నారు. అలాగే మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
డ్రెస్సింగ్ రూమ్‌లో మోదీ: 2023 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన తర్వాత టీమిండియా ఆటగాళ్లు తీవ్ర నిరాశలో ఉన్నారని సిరాజ్ చెప్పారు. ఆ సమయంలో ప్రధాని మోదీ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చారని అన్నారు. ఆటగాళ్లను ఓదార్చి వారిలో ఉత్సాహాన్ని నింపారని తెలిపారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ.. సిరాజ్ 2023లో ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత మోదీ గారు డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి ఆయన మాటలతో మాకు ధైర్యం చెప్పారని అన్నారు. ఆ ఓటమి బాధ నుంచి బయటపడటానికి అది ఎంతో సహాయపడిందని సిరాజ్ తెలిపారు.
విజయంలోనూ అభినందనలు: ఓటమిలో అండగా నిలిచిన మోదీ విజయంలోనూ తమకు తోడుగా నిలిచారని సిరాజ్ తెలిపారు. ఒక సంవత్సరం తర్వాత మేము టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఆయన మమ్మల్ని అభినందించడానికి ఫోన్ చేశారని అన్నారు. ఓటమిలో అలాగే విజయంలో ఆయన మాకు తోడుగా నిలిచారని తెలిపారు. నిజంగా అది ప్రేరణ ఇచ్చే విషయమని తెలిపారు.
2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఫైనల్‌లో ఓటమి చవిచూసింది. అయితే ఆ ఓటమి నుంచి తేరుకుని 2024లో టీ20 వరల్డ్‌కప్ ఆ తర్వాత 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుని వరుస విజయాలను నమోదు చేసింది. ప్రస్తుతం ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్న సిరాజ్.. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన తర్వాత బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం.


