భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(Syed Abid Ali) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1941లో అప్పటి నిజాం రాష్ట్రంలోని హైదరాబాద్‌లో జన్మించిన అబిద్ అలీ.. భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. 1959 – 1979 వరకు హైదరాబాద్ తరపున రంజీల్లో పాల్గొని పలు రికార్డులు సాధించారు. అనంతరం భారత జట్టుకు ఎంపికై పటౌడీ కెప్టెన్సీలో పలు విజయాలను సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారు.
1967లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో 55/6 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. 1967-1975 కాలంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా సేవలు అందించారు. మీడియం పేసర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన అలీ.. 1971లో ఓవెల్ టెస్టు గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. అబిద్ తన కెరీర్లో మొత్తం 29 టెస్టు మ్యాచులు ఆడి.. 47 వికెట్లు తీసుకున్నాడు. ఆయన మృతిపై పలువురు క్రికెట్ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.