టీమిండియా సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా(Piyush Chawla) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో గడిపిన తరువాత ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని తెలిపాడు. తన కెరీర్‌లో తనకు మద్దతు ఇచ్చిన కోచ్‌లు, కుటుంబ సభ్యులు, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాడు.
కాగా భారత జట్టు తరపున కేవలం 25 వన్డేలు, 7 టీ20లు, 3 టెస్టులు మాత్రమే ఆడి 43 వికెట్లు తీశాడు. అయినా కానీ టీమిండియా గెలిచిన 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్ జట్లలో చావ్లా కీలక సభ్యుడు కావడం విశేషం.
టీమిండియా తరుపున పెద్దగా ఆడకపోయినా ఐపీఎల్‌లో మాత్రం బాగా రాణించాడు. ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడి 192 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు చావ్లా ప్రాతినిథ్యం వహించాడు. చివరిగా 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2024 ఐపీఎల్ మెగా వేలంలో మాత్రం ఏ ఫ్రాంఛైజీ చావ్లాను తీసుకోలేదు.


