IPL without Audience: ఐపీఎల్ 2026 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా, పరిమిత వేదికల్లోనే నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(CTI) ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ భావించారు. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ఈ ప్రతిపాదన పంపించినట్లు తెలిపారు.
రెండ్రోజుల క్రితం దేశీయంగా ఇంధన ధరలు లీటరుకు రూ. 3 పెరిగిన విషయం తెలిసిందే. ఫలితంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాలు, రవాణా వల్ల జరుగుతున్న ఇంధన వృథాను అరికట్టడమే ముఖ్య ఉద్దేశ్యంగా CTI లేఖ రాసింది. టోర్నమెంట్ నిర్వహణ వల్ల పర్యావరణంపై పడుతున్న భారీ కార్బన్ ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read: https://teluguprabha.net/telangana/actor-manchu-manoj-started-trust/
ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియాల్లో వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావడం వల్ల విపరీతమైన రవాణా రద్దీ ఏర్పడుతోందని.. కాబట్టి మిగిలిన మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకుండా ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు జరపాలని లేఖలో CTI కోరింది. జట్లు నిరంతరం ఒక నగరం నుంచి మరో నగరానికి విమానాల్లో ప్రయాణించడం వల్ల విమానాలపై ఇంధన భారం పడుతోందని.. దీనిని నిరోధించేందుకు కొన్ని పరిమిత వేదికల్లోనే టోర్నీని ముగించాలని కోరింది.
విమానాలపై ఇంధన భారం
ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రయాణించే చార్టర్డ్ బోయింగ్ 737, ఎయిర్‌బస్ A320 విమానాలు గంటకు 2,400 నుంచి 3,000 లీటర్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను వినియోగిస్తాయని CTI తెలిపింది. ప్రతి జట్టు ఈ సీజన్‌లో దాదాపు 10 విమాన ప్రయాణాలు చేస్తుందని.. దీనివల్ల కేవలం ఒకే ఒక ఫ్రాంచైజీ దాదాపు 50,000 నుంచి 70,000 లీటర్ల ఇంధనాన్ని ఖర్చు చేస్తోందని పేర్కొంది. ఈ ఇంధన వృథా, రవాణా ఖర్చులను తగ్గించడానికి ఐపీఎల్ 2026 షెడ్యూల్‌ను పునర్వ్యవస్థీకరించాలని బ్రిజేశ్ గోయల్ తన లేఖలో కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
అభిమానుల ఆందోళన
అయితే.. CTI ప్రతిపాదనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకులు లేకుండా స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడటం వల్ల ప్లేయర్లలో ఉత్సాహం రాదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన పొదుపు చేసేందుకు రాజకీయ పార్టీలు ర్యాలీలు, ఎన్నికల ప్రచారాలు.. ప్రజలు లేకుండా నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

