David Warner : చాలా రోజుల తరువాత ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌లో శతకం బాదాడు. గత మూడేళ్లుగా ఏ ఒక్క ఫార్మాట్ (టెస్టులు, వన్డేలు, టీ20)ల్లో వార్నర్ సెంచరీ చేయలేదు. అర్థశతకాలు కొడుతున్నా వాటిని శతకాలుగా మలచలేక ఇబ్బందులు పడ్డాడు. దాదాపు 1043 రోజుల తరువాత అతడు సెంచరీ కొట్టడం గమనార్హం. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో వార్నర్ 102 బంతుల్లో 106 పరుగులు చేశాడు. తద్వారా తనపై వస్తున్న విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడికి ఇది 44వ శతకం కాగా.. వన్డేల్లో 19వ సెంచరీ. చివరి సారిగా అతడు 2020 జనవరిలో ముంబైలో భారత్‌పై శతకం చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వార్నర్‌తో పాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(152; 130 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం బాదడంతో నిర్ణీత 48 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు. వార్నర్, హెడ్ జోడి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 269 పరుగులు జోడించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. జేసన్ రాయ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు పడగొట్టగా, ప్యాట్ కమిన్స్, సీన్ అబాట్ చెరో రెండు వికెట్లు తీశారు.