DC vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం సాయంత్రం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో డీసీ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని అక్షర్ పటేల్ సేన పోరాడి ఛేదించింది. అక్షర్, మిల్లర్ హాఫ్ సెంచరీలకు తోడు.. చివర్లో అశుతోష్, మాధవ్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకి విజయాన్ని అందించారు.
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 59(36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు నాటౌట్), ప్రియాంశ్ ఆర్య 56(33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులతో విజృంభించారు. కూపర్ కనోలీ (38), సూర్యాంశ్ షెగ్డే(21) మంచి సహకారం అందించగా.. ప్రభ్ సిమ్రన్ సింగ్(18) ఫర్వాలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్ చెరో 2 వికెట్లు, ముఖేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.
211 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి కాస్త తడబడినా ఆ తర్వాత పుంజుకుంది. అక్షర్ పటేల్ 56(30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ 51(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టు గెలుపు దిశగా కృషి చేశారు. ట్రిస్టన్ స్టబ్స్(12) నిరాశపరిచినా.. చివర్లో అశుతోష్ శర్మ (24), మాధవ్ తివారీ (18 నాటౌట్), నబీ (2 బంతుల్లో 10 పరుగులు నాటౌట్) బౌండరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే డీసీ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీయగా, బెన్, స్టోయినస్‌కి తలో వికెట్ దక్కింది.

