చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన వయస్సు గురించి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్న యువ క్రికెటర్లను చూస్తే తాను పెద్దవాడిని అయిపోయానని అనిపిస్తోందని అన్నాడు. ఆదివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం తన మనోభావాలను మీడియాతో పంచుకున్న ధోనీ, తనకు ఎదురైన కొన్ని సంఘటనలను గుర్తు చేశాడు.
“రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ నా కాళ్లకు నమస్కారం చేశాడు. అప్పుడే నాలో వయసు పెరిగిందనే భావన మొదలైంది. మరోసారి డగౌట్‌లో కూర్చున్నప్పుడు ఆండ్రీ సిద్ధార్థ్ నా పక్కన వచ్చి కూర్చున్నాడు. అతడి వయసు అడిగినప్పుడు అతడు 25 ఏళ్లుగా తెలిపాడు. అప్పుడు అతడు నాకంటే సరిగ్గా 25 ఏళ్లు చిన్నవాడని గ్రహించాను. అలా తనతో పోలిస్తే తానొక సీనియర్‌గా మారిపోయానని నాలో బలంగా తలెత్తింది అంటూ ధోనీ తెలిపాడు.
ప్రస్తుతం 43 ఏళ్లైన ధోనీ, రాబోయే జులై 7న 44వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2025లో ఆడతారా? రిటైర్మెంట్ ప్రకటిస్తారా? అనే దానిపై మాట్లాడుతూ – “ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోను. నా భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉంది. గుజరాత్‌తో మ్యాచ్‌లో విజయంతో ఈ సీజన్‌ను ముగించగలగటం ఆనందంగా ఉందని తెలిపాడు.
ప్రస్తుతం ఇంటికి వెళ్లి కుటుంబంతో సమయం గడుపుతాను. నా బైక్ రైడ్స్‌ను ఆస్వాదిస్తాను. ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నానని కూడా కాదు, తిరిగి వస్తానన్న మాట కూడా కాదు. ఆలోచించి, శరీర పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాను. ఇది ప్రొఫెషనల్ క్రికెట్ ఇక్కడ ఫిట్‌నెస్ అత్యంత కీలకం అని ధోనీ వివరించాడు. ఆయన మాటల ప్రకారం ఇంకా ఐపీఎల్‌లో ధోనీ భవితవ్యంపై స్పష్టత రావడానికి కొంత సమయం ఉంది. అయితే అభిమానులు మాత్రం మళ్లీ మైదానంలో తమ ‘థాలా’ను చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నారు.


