టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధోనీ టీమిండియాకు అందించిన విజయాలు క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనీ.. 2025 ఐపీఎల్ కు సిద్ధమవుతున్నాడు. ఇక గత సీజన్ లో CSK ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ.. ప్రత్యేకించి ధోనీ కోసమే ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చారంటే అతిశయోక్తి కాదు. ఇక ధోనీకి రాంచీలో అద్భుతమైన ఫామ్‌హౌస్.. హర్ములోని ధోనీ బంగ్లా ఉంది. దానిని చూస్తే మతి పోతుంది.
ధోనీ ఇంటి బయట గోడపై జెర్సీ నెంబర్ 7.. దానితో పాటు ఐకానిక్ హెలికాప్టర్ షాట్‌తో కూడిన డిజైన్ చేశారు. మహి టీమిండియాకు ఆడే సమయంలో అతని జెర్సీ నెంబర్ 7 అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. BCCI ధోనీ మీద గౌరవంతో.. 7వ నెంబర్ జెర్సీని రిటైర్ చేసింది. అంటే మరో ఆటగాడికి ఆ జెర్సీని ఇవ్వరు. ఇక ధోనీకి 7వ నెంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1981 జులై 7న మహేంద్రసింగ్ ధోనీ పుట్టాడు. అందుకే అతడికి 7వ నెంబర్ ఎంతో ప్రత్యేకం.
ఇక ధోనీ నివాసం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఇంటిపై హెలికాప్టర్ షాట్, వికెట్ కీపింగ్ యాక్షన్‌లు, 2007 ప్రపంచ టీ20లో ఆయన గెలిచిన పోస్టర్, 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆయన కొట్టిన చివరి సిక్స్ వంటి డిజైన్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ రాంచీ నివాసాన్ని నిర్మించడానికి భూమిని జార్ఖండ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డు 2009లో ధోనీకి ఇచ్చింది. ఈ నివాసం ఇప్పుడు అభిమానులకు సెల్ఫీ స్పాట్‌గా మారింది. అయితే.. ప్రస్తుతం ధోనీ రాంచీలోని సిమ్లియాలో తన విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నాడు.