MS Dhoni VS Cricket:భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అభిమానుల ప్రేమ ఎప్పటికీ తగ్గలేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆయన తప్పుకున్నా, మైదానంలో ధోనీని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక మాత్రం అలాగే కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు సార్లు టైటిల్ అందించిన ఈ ఆటగాడు ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు. రెండు నెలల టోర్నమెంట్‌కే పరిమితమైనప్పటికీ, ప్రతి ఏడాది ఆయన ఆడతారా అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంటూనే ఉంది.
రిటైర్ అవుతారన్న…
గత రెండు సీజన్లలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ధోనీ రిటైర్ అవుతారన్న ఊహాగానాలు వచ్చినప్పటికీ, చివరికి మైదానంలో అడుగుపెట్టడం చూసి అభిమానులు సంతోషించారు. ఐపీఎల్ 2026 సీజన్‌కి ఇంకా సమయం ఉండగానే, ధోనీని ఎక్కడ చూసినా అభిమానులు మళ్లీ మైదానంలోకి రావాలని కోరుతున్నారు.
స్పష్టత ఇవ్వలేనని…
ఇటీవల ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీకి కూడా అదే రిక్వెస్ట్ వినిపించింది. అయితే ఈసారి ఆయన సమాధానం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో షేర్ అవుతోంది. ధోనీ మాట్లాడుతూ, తాను ఐపీఎల్ 2026లో ఆడతానా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేనని తెలిపాడు. ఆ నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ వరకు వేచి చూస్తానని చెప్పాడు. ఇప్పుడు చెప్పడం సరైన సమయం కాదని, సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని వివరించాడు.
మోకాలు నొప్పిగా ఉంది…
ఆ సందర్భంలో ఒక అభిమాని, “మీరు తప్పకుండా ఆడాలి” అని కోరగా, ధోనీ నవ్వుతూ తన మోకాలి నొప్పి గురించి సరదాగా వ్యాఖ్య చేశాడు. “మోకాలు నొప్పిగా ఉంది… దాన్ని ఎవరు భరిస్తారు?” అంటూ చెప్పడంతో అక్కడ ఉన్నవారు అంతా నవ్వుల్లో మునిగిపోయారు.
ఐపీఎల్ 2026 వచ్చే ఏడాది మార్చి నుంచి మే మధ్య జరగనుంది. కానీ సీఎస్‌కే సారథ్యం ఎవరు చేపడతారన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డ కారణంగా ధోనీ తాత్కాలికంగా సారథి బాధ్యతలు నిర్వహించాడు. ఇప్పుడు కొత్త సీజన్ కోసం సీఎస్‌కే కొత్త నాయకుడి కోసం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సంజు శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకురావాలని సీఎస్‌కే యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సంజు ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల ఆయన రాజస్థాన్ రాయల్స్ తనకు ఎంతో ముఖ్యమని చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి.


