శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే(Dimuth Karunaratne) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిబ్రవరి 6న ఆస్ట్రేలియాతో జరిగే టెస్టునే తన చివరి టెస్టు అని వెల్లడించాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్ కారణంగా చివరి ఏడు టెస్ట్ మ్యాచ్‌లలో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
‘‘ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టునే నా చివరి టెస్ట్ అని శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలియజేశాను. అరంగేట్రం చేసిన గాలె అంతర్జాతీయ స్టేడియంలోనే నా వందో టెస్టు మ్యాచ్ కూడా జరగనుంది. కాబట్టి అక్కడే రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను” అని కరుణరత్నే తెలిపాడు. దీంతో 100 టెస్టులు ఆడిన ఏడో శ్రీలంక క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించనున్నాడు.
కాగా కరుణరత్నే 14ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన అతడు..7,172 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 50 వన్డేల్లో 1,316 పరుగులు చేయగా ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కారణంగా 2018, 2021, 2023 సంవత్సరాల్లో ‘ఐసీసీ టెస్టు క్రికెట్ టీమ్ ఆఫ్ ది ఇయర్’కు కరుణరత్నే ఎంపికయ్యాడు.