New Delhi: భారత దేశంలో క్రీడా రంగంలో పరివర్తనాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చదరంగంలో భారత యువత ప్రదర్శిస్తున్న ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రశంసించింది.
గత సంవత్సరం 18 ఏళ్ల డి.గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇది భారత చెస్ రంగానికి మార్గదర్శకంగా మారింది. ఆర్.ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, విదిత్ గుజ్రాతి, కోనేరు హంపీ, దివ్య దేశ్‌ముఖ్, ఆర్. వైషాలి వంటి యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన స్థిరత్వంతో తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఇటీవల 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ మహిళల ప్రపంచ కప్‌ను గెలిచింది. 38 ఏళ్ల హంపీని గ్రిప్పింగ్ ఫైనల్‌లో ఓడించి చరిత్రను సృష్టించింది. ఒకే దేశానికి చెందిన ఇద్దరు మహిళలు ఈ అంతర్జాతీయ ఫైనల్లో పోటీ పడటం దేశ గర్వకారణం. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉన్నా ప్రతిభలో ఏ మాత్రం తేడా లేకుండా ప్రపంచాన్ని మెప్పించడం నిజంగా భారత మహిళా శక్తికి నిదర్శనం అని రాష్ట్రపతి అన్నారు.
మన యువత ఆటలలో నూతన ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. చదరంగంలో భారత యువత ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025లో ఉన్న దార్శనికత ప్రకారం ముందుకు క్రీడా రంగంలో భారత్‌ను గ్లోబల్ స్పోర్టింగ్ పవర్ హౌస్‌గా నిలపాలని చూస్తున్నాం అని ద్రౌపది ముర్ము అన్నారు.
Read more: https://teluguprabha.net/sports-news/arjun-tendulkar-engagement-sania-chandhok/
ఇప్పటి వరకు మహిళ సాధికారత గురించి ఎన్నో మార్లు మాట్లాడినా, అనేక సందర్భాల్లో అది కేవలం నినాదంగా మిగిలిపోయింది. కానీ, ఇప్పుడది నిజంగా మారుతోంది.నారీ శక్తి వందన అధినియమ్ వలె ప్రగతిశీల చట్టాలు భారత మహిళలకు నూతన సాధికారతను అందిస్తున్నాయి. మహిళలు రాజకీయాల్లో, విద్యలో, కార్మిక రంగాల్లో, వ్యవసాయంలో, అంతర్జాతీయ స్థాయిలోనూ తమ ముద్ర వేస్తున్నారు. ఉపాధిలో లింగ అసమతుల్యత కూడా తగ్గుతూ వస్తోంది. పురుషులు – మహిళల మధ్య ఉపాధి అవకాశాల్లో ఉన్న తేడా గణనీయంగా తగ్గుతోంది. ఇది మన దేశంలో మహిళల అభివృద్ధికి మంచి సూచిక అని రాష్ట్రపతి తన ప్రసంగంలో తెలిపారు.


