Dwayne Bravo : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో గుడ్ బై చెప్పాడు. దీంతో ఇక నుంచి బ్రావో విన్యాసాలను ఐపీఎల్‌లో చూడలేం. ఆటగాడిగా రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటికీ తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో మాత్రం అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. వచ్చే సీజన్(ఐపీఎల్ 2023)కి డ్వేన్ బ్రావోను చెన్నై జట్టు తమ బౌలింగ్ కోచ్‌గా ఎంచుకుంది. ఇప్పటి వరకు చెన్నై బౌలింగ్ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మీపతి బాలాజీ వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకోవడంతో అతడి స్థానంలో బ్రావోను చెన్నై జట్టు తీసుకుంది.
వచ్చే సీజన్‌కు బ్రావోను చెన్నై జట్టు అట్టి పెట్టుకోకుండా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే అతడు ఐపీఎల్‌కి ఆటగాడిగా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. వెంటనే బౌలింగ్ కోచ్‌గా చెన్నై అతడిని నియమించుకుంది. ఏకకాలంలో ఈ రెండు పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
“ఈ కొత్త ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే నా ఆట(కెరీర్) దాదాపుగా ముగిసిన తరువాత నేను చేస్తున్న పని ఇది. బౌలర్లతో కలిసి పనిచేయడాన్ని నేను ఎంతో ఆస్వాదిస్తాను. ఆటగాడి నుంచి కోచ్ పాత్రకు మారడం అంటే సర్దుకుపోవడం అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఆడుతున్నప్పుడు కూడా తోటి బౌలర్లతో కలిసే పని చేశాను. ఇక ఐపీఎల్‌లో చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఐపీఎల్‌లో చరిత్రలో భాగమైనందుకు ఆనందంగా ఉంది.” అని బ్రావో అన్నాడు.
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి బ్రావో ఆడుతున్నాడు. తొలుత ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో వేలంలో చెన్నై జట్టు అతడిని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అతడు చెన్నై జట్టు తరుపునే ఆడుతున్నాడు. అయితే.. చెన్నైపై రెండేళ్లు నిషేదం విధించిన కాలంలో మాత్రం గుజరాత్ లయన్స్‌కు ఆడాడు.
మొత్తంగా ఐపీఎల్ లో 161 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 183 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాకాంలు 22 పరుగులకు 4 వికెట్లు. అటు బ్యాటింగ్‌లో 1560 పరుగులు చేశాడు. అత్యధికం 70 నాటౌట్. అతడి ఖాతాలో ఐదు అర్థశతకాలు ఉన్నాయి.