ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా(Team India) నెంబర్ వన్ టీమ్‌గా నిలిచింది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్(ICC Rankings)లో రోహిత్ సేన 119 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానం దక్కించుకుంది. మరోవైపు ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించిన న్యూజిలాండ్ జట్టు 105 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఫైనల్లో ఓడిన పాకిస్థాన్ జట్టు 107 పాయింట్స్‌తో మూడో స్థానానికి పడిపోయింది. ఇక శ్రీలంకపై 2-0తో సిరీస్ ఓడిపోయిన ఆస్ట్రేలియా 110 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో 100 పాయింట్లతో సౌతాఫ్రికా ఐదో స్థానంలో కొనసాగుతోంది. భారత్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన ఇంగ్లాండ్ జట్టు 7వ స్థానంలో.. శ్రీలంక 6వ స్థానం దక్కించుకున్నాయి. కరేబియన్ జట్టు వెస్టిండీస్ 10వ స్థానంలో ఉండటం గమనార్హం.
కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా పోటీ పడనున్నాయి. వరల్డ్ కప్ తర్వాత ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీని గెలవాలని అన్ని జట్లు పట్టుదలతో ఉన్నాయి.