మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), రూట్ (69) హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా.. బ్రూక్ (31), బట్లర్ (34), లివింగ్‌స్టన్ (41) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హర్షిత్‌రాణా, పాండ్య, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. భారీ టార్గెట్‌తో బరిలో దిగనున్న భారత్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తొలి వన్డేలో రోహిత్ సేన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, డకెట్ శుభారంభం అందించారు. టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే నిలకడగా ఆడుతున్న ఈ జంటను డెబ్యూ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విడదీశాడు. ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి భారత్‌కు ఊరటనిచ్చాడు. అనంతరం జో రూట్ ఆచితూచి ఆడుతూ 69 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివర్తో లివింగ్ స్టోన్ (41), అదిల్ రషీద్ (14) దూకుడుగా ఆడారు. చివరి నాలుగు ఓవర్లలో 43 పరుగులను ఇంగ్లండ్ బ్యాటర్లు రాబట్టారు. దీంతో 300 పరుగులకు పైగా పరుగులు చేశారు.