Cheteshwar Pujara : ఏం జరిగినా మొత్తానికి చచ్చీ చెడి బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో అభిమానులు హ్యాపీ. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే.. ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును పుజారాకు ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది. అతడు ఏం అంత గొప్పగా రాణించాడు అని అతడికి ఇచ్చారు. సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మీకు కనిపించలేదా..? అని దుమ్మెత్తి పోస్తున్నారు.
రెండో టెస్టుల్లో అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు 42 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గెలిచిపించాడు. కనుక అతడికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇవ్వడం బాగానే ఉంది. మొదటి టెస్టులో రాణించిన పుజారా రెండో టెస్టులో దారుణంగా విఫలం అయ్యాడు. అతడు అనవసరంగా వికెట్ పారేసుకోవడంతో జట్టు కష్టాల్లో పడింది. ఇది మీకు కనిపించలేదా..? అని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి పుజరా ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 74 సగటుతో 222 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, ఓ అర్థశతకం ఉంది. అయితే.. ఈ పరుగులు ఎక్కువ శాతం తొలి టెస్టులోనే (90,102 నాటౌట్) చేశాడు. రెండో టెస్టులో 24, 6 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలం అయ్యాడు. అదే శ్రేయస్‌ను తీసుకుంటే రెండు టెస్టుల్లోనూ కీలక సమయాల్లో అతడు రాణించాడు. అంతేకాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 101 సగటుతో 202 పరుగులు చేశాడు.
శ్రేయస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు చేసి టీమ్ భారీ స్కోర్ చేయడంలో సాయం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడికి బ్యాటింగ్ రాలేదు. అలాగే రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు చేసిన శ్రేయస్ రెండో ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు వచ్చి 29 పరుగులతో అజేయంగా నిలిచి అశ్విన్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో అందరూ శ్రేయస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కుతుందని బావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ పుజారాకు ఇవ్వడంపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు మండిపడుతున్నారు. ఏలెక్కన పుజారాకు అవార్డు ఇచ్చారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు.