FIFA World Cup : ఆట ఏదైనా కానివ్వండి తమ జట్టు గెలిస్తే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పటాకులు కాలుస్తూ, డ్యాన్స్ చేస్తూ నానా హంగామా చేస్తారు. ఆటగాళ్లు కూడా తాము కూడా ఏమీ తక్కువ కాదంటూ కేరింతలు కొడుతూ గెంతులేస్తుంటారు. అందరి సంగతి ఎలా ఉన్నా కూడా జపాన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. జపాన్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీపై చారిత్రక విజయం సాధించిన తరువాత ఆ జట్టుతో పాటు అభిమానులు చేసుకున్న సంబురాలు ప్రపంచానికే ఆదర్శం.
నాలుగు సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టు జర్మనీ, ఆరు సార్లు మెగా టోర్నీలో పాల్గొన్నా కూడా ఒక్క సారి ప్రిక్వార్టర్ దాటని జట్టు జపాన్. బుధవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో జపాన్ విజయం సాధించింది. అంతే మైదానంలోని ఆటగాళ్లతో పాటు స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు సంబరాల్లో మునిపోయారు. అది కాసేపే.
ఆ తరువాత ఆటగాళ్లు ఖలీఫా స్టేడియం నుంచి లాకర్ గదికి వెళ్లి హ్యాంగర్లకు వేసిన దుస్తులను, టవళ్లను మడిచి శుభ్రంగా సర్దిపెట్టగా, మైదానంలోని అభిమానులు స్టాండ్స్‌లో ఉన్న చెత్తను తొలగించారు. ప్రేక్షకులు వాడి పారేసిన నీళ్ల బాటిళ్లు, శీతల పానియాల డబ్బాలు, ఆహార పదార్థాల కవర్లు ఏరి మైదాన సిబ్బందికి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫిఫా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి ‘థ్యాంక్యూ సోమచ్’ అంటూ జపాన్ చేసిన పనిని మెచ్చుకుంది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
నిజమైన అభిమానులు అంటే మీరే అని ఒకరు ట్వీట్ చేయగా.. ఇలా కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారా..? అని ఇంకొక యూజర్ ట్వీట్ చేశాడు.