న్యూజిలాండ్(తెలుగు ప్రభ): న్యూజిలాండ్ పర్యటనలో ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా, ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి పోరు జరగనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు బ్యాటింగ్ విభాగంలో ఎంతో దృఢంగా కనిపిస్తున్నప్పటికీ, బౌలింగ్ విభాగం మాత్రం ఒకింత బలహీనంగానే కనిపిస్తోంది. టీ20 సిరీస్ ఆఖరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్భుతంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. అదే జోరును కొనసాగిస్తూ వన్డేల్లోనూ భారత బౌలర్లకు వారు కఠిన సవాలు విసిరే అవకాశం ఉంది.
ముందుండి నడిపించాల్సిన టాప్-3 నే..
ఈ సిరీస్‌లో భారత బ్యాటింగ్ భారం ప్రధానంగా టాప్-3 బ్యాటర్లపైనే ఆధారపడి ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నిలకడగా రాణించి జట్టుకు శుభారంభం అందించాల్సి ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఈ ముగ్గురూ అద్భుత ప్రదర్శన చేశారు. అంతకుముందు రోహిత్, కోహ్లిల ఫామ్‌పై కొన్ని ప్రశ్నలు తలెత్తినప్పటికీ, వారు తమ అనుభవంతో జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

