IPL 2026 LSG vs KKR: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం లక్నో ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ ఘన విజయాన్ని నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేనాటికి ఇరు జట్ల స్కోర్లూ సమం కావడంతో సూపర్ ఓవర్.. భవితవ్యాన్ని తేల్చింది. ఈ సీజన్‌లో ఇదే తొలి సూపర్ ఓవర్ కావడం విశేషం. మ్యాచ్ అంతా ఒక ఎత్తు అయితే ఇక చివరి ఓవర్ వరుసగా నో బాల్స్, భారీ షాట్లు, వికెట్‌తో ప్రేక్షకులకు పైసా వసూల్ అనుభూతినిచ్చింది.
ముందుగా టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా జట్టు ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. ఓపెనర్లు త్వరగానే పెవిలియన్ చేరడం, రింకూ సింగ్ 83(51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), కామెరాన్ గ్రీన్ 34(21) మినహా మిగతా బ్యాటర్లు రాణించలేకపోవడంతో కేకేఆర్ స్కోరు 155కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి స్వల్ప లక్ష్యాన్ని లక్నో ముందుంచింది. లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. జార్జ్ లిండేకి ఒక వికెట్ దక్కింది.
అయితే 155 పరుగులకే పరిమితమై స్వల్ప లక్ష్యాన్ని ఎల్‌ఎస్‌జీ ముందు ఉంచినా.. లక్ష్య ఛేదనలో ఆ జట్టుకి కేకేఆర్ తమ బౌలింగ్, ఫీల్డింగ్‌తో కట్టడి చేసిందనే చెప్పవచ్చు. పరుగుల కట్టడిలో కేకేఆర్ విజయం సాధించింది. మార్‌క్రమ్(31), రిషబ్ పంత్ 42(38 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్), ఆయుష్ బదోనీ(24), హిమ్మత్ సింగ్(19) పరుగులు చేశారు. ఇక చివరి ఓవర్‌లో మహమ్మద్ షమీ రాకతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బాల్ భారీ సిక్సర్ కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి స్కోరు సమంగా మారి సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్‌లో ఎల్‌ఎస్‌జీ ఒక వికెట్ కోల్పోయి ఒక్క పరుగు మాత్రమే చేసింది. కేకేఆర్ తరఫున రింకూ సింగ్ బౌండరీతో గెలుపును ఖాయం చేశాడు. ఈ విజయంతో కేకేఆర్ వరుసగా రెండు గెలుపులను నమోదు చేసింది.

