ఒకప్పుడు తాగునీటికి అవస్థలు పడిన మహబూబ్ నగర్… నేడు విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నదని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో మహబూబ్ నగర్ ను అద్భుతంగా తీర్చిదిద్దడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
సమానత్వానికి సాక్షిగా ఫ్రెంచ్ మోటార్ సైక్లిస్ట్ అలిసన్ గ్రున్ ఆధ్వర్యంలోని ఫ్రీ డబ్ల్యూ (Free W) అనే వేదిక ద్వారా తెలంగాణలో… ఫ్రాన్స్, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్ మరియు థాయ్‌లాండ్ కు చెందిన 8 మంది విదేశీ బైక్ రైడర్ల యాత్రను మంత్రి మహబూబ్ నగర్ లోని తమ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. అనంతరం వారితో పాటు కొద్దిసేపు బైక్ రైడింగ్ చేశారు. బైపాస్ రోడ్డు హ్యాండ్ ఫౌంటెన్ కూడలి వద్ద విదేశీ బైక్ రైడర్ లతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.