Bangladesh Women Cricket Team: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు మాజీ పేసర్ జహానారా ఆలం మాజీ సెలెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసింది. తాను టీమ్ లో ఉన్నప్పుడు మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం తనను లైంగికంగా వేధించాడని.. దానికి అడ్డు చెప్పినందుకు తన కెరీర్‌ను అడ్డుకున్నాడని జహానారా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. తాను మానసిక ఆరోగ్యం కారణంగానే జట్టుకు దూరంగా ఉన్నట్లు తెలిపింది.
ఒకనాడు సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం తన దగ్గరికి వచ్చి భుజంపై చేయి వేసి నీ పీరియడ్స్ వచ్చి ఎన్ని రోజులైందని అడిగాడని జహానారా తెలిపింది. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం, ఫిజియోలు ఇలాంటి విషయాలు చూసుకుంటారని.. ఇలాంటి సమాచారం సెలెక్టర్‌కు ఎందుకని తాను ప్రశ్నించినట్లు తెలిపింది. అయినా సరే ఆయన ఆగకుండా నీ పీరియడ్స్ అయిపోతే చెప్పు, నేను కూడా నీ వైపు చూడాలి కదా అని అన్నాడు. సారీ భయ్యా మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు అని బదులిచ్చాను. తన లైంగిక ప్రతిపాదనను తిరస్కరించినప్పటి నుంచి తనను ఇబ్బందులకు గురిచేశాడని జహానారా ఆరోపించారు.
మంజురుల్ నేరుగా కాకుండా టౌహిద్ భాయ్ ద్వారా తనను తొలిసారి సంప్రదించారని.. దీని నుండి తాను తెలివిగా తప్పించుకున్నానని ఆమె తెలిపింది. ఈ ఘటన 2021లో జరిగినట్లు చెప్పింది. అప్పటి నుండే మంజురుల్ తనపై అవమానాలు, వేధింపులు మొదలుపెట్టారని జహానారా ఆరోపించింది. 2022 మహిళా వరల్డ్ కప్ సందర్భంగా కూడా ఇలాంటి చర్యలకే పాల్పడ్డాడని ఆమె పేర్కొంది.
Also Read: WPL 2026 – రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది.. దీప్తి శర్మకు బిగ్ షాక్..
ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)లోని సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. మహిళా కమిటీ ఛైర్‌పర్సన్ నాదెల్ చౌదరి కూడా తన వేధింపులను ఆపడంలో విఫలమయ్యారని..ఆయన తాత్కాలిక పరిష్కారం చూపారే తప్ప సమస్యను అడ్డుకోలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి తన ఫిర్యాదులను అసలు లెక్కచేయలేదని అన్నది. జహానారా ఆరోపణలను తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పరిగణనలోకి తీసుకుంది. దీనిపై తప్పకుండా విచారణ చేయిస్తామని బీసీబీ వైస్ చైర్మన్ షకావత్ హుస్సేన్ అన్నారు.


