Friday, July 11, 2025
HomeఆటSuresh Raina: నటుడిగా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఎంట్రీ

Suresh Raina: నటుడిగా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఎంట్రీ

Suresh Raina Entered in to the movies: భారతదేశంలో సినిమాలకు, క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమ వ్యవహరాలు నడపడం సర్వసాధారణం. అలాగే కొంత మంది క్రికెటర్లు హీరోయిన్లను పెళ్లి కూడా చేసుకున్నారు. అలాగే క్రికెటర్ల జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్ బయోపిక్‌గా ’83’ , మిస్టర్ కూల్ ధోనీ బయోపిక్‌గా ‘ఎంఎస్ ధోనీ’, సచిన్ బయోపిక్‌గా సచిన్-ఎ బిలియన్ డ్రిమ్స్ చిత్రాలు తెరకెక్కి మంచి ఆదరణ అందుకున్నాయి. ఇక త్వరలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా వెండితెరపైకి రానుంది.

- Advertisement -

ఇదిలా ఉంటే ఇటీవల మాజీ క్రికెటర్లు సినిమాల్లో నటించడం కామన్‌గా మారింది. మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘కోబ్రా’ చిత్రంలో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో అలరించాడు. ఇక మరో క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా కన్నడ మూవీ ‘ఫ్రెండ్‌ షిప్’ సినిమాలో నటించాడు. శిఖర్ ధావన్ హిందీ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు. ఇక ధోనీ అయితే నిర్మాతగా మారి ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ క్రికెటర్ల బాటలో మరో మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన రైనా చిన్న తలాగా పేరు దక్కించుకున్నాడు. అందుకే తమిళ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేయనున్నాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి లోగాన్ దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ నైట్ స్టోరీస్ పతాకంపై శ్రవణకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. క్రికెటర్ శివమ్ దూబే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్న రైనా.. వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తమిళ సినిమా ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు.

కాగా రైనా భారత్ జట్టులో అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడిగి రికార్డు సృష్టించాడు. తన కెరీర్‌లో మొత్తం 322 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 32.87 సగటుతో 7,988 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2011 వరల్డ్ కప్‌, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News