IND vs PAK Asia Cup: దుబాయ్ వేదికగా టీ20 ఫార్మాట్‌లో ప్రస్తుతం ఆసియా కప్ టోర్నమెంట్ జరుగుతోంది. భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడింది. కేవలం 13.1 ఓవర్లలోనే ప్రత్యర్థిని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు అదే దూకుడుతో రేపు దాయాదితో పోరులో అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ క్రమంలో భారత జట్టు వ్యూహంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియాలో కేవలం ముగ్గురు ప్రధాన బౌలర్లతో మాత్రమే బరిలోకి దిగింది. అయితే ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ భారత జట్టు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తుందా అని కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్నించాడు. అదేవిధంగా టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ అయిన ఆర్షదీప్ సింగ్‌ను ఆడించకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు.
టీమిండియా మొదటి మ్యాచ్‌లో ఆర్షదీప్ సింగ్‌ను కచ్చితంగా ఆడించాల్సింది. టీ20ల్లో ఆడేందుకు భారత జట్టుకు 8 మంది బ్యాటర్లు అవసరమా? పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు నలుగురి కంటే ఎక్కువ మందికి బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుందో.. లేదో కూడా తెలియదు. ఇక్కడ ప్రతిదీ స్పిన్ ఓరియెంటెడ్‌గా మారింది. మీడియం పేసర్లకు పిచ్ నుంచి సరైన మద్దతు లేదు. ఇక దాయాది జట్టు కూడా స్పిన్‌కే ప్రాధాన్యం ఇస్తోంది. అని శ్రీకాంత్ అన్నాడు.
అదేవిధంగా టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆట తీరుపై కూడా శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌పై అభిషేక్ శర్మ భారీ స్కోర్ చేసినప్పటికీ అతని గురించి ఇప్పుడే హైప్ చేయలేనని వెల్లడించాడు. అప్పుడప్పుడు షార్ట్ బంతులకు కూడా క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరుగుతున్నాడని.. ఐపీఎల్‌లో కూడా ఇలా రెండు మూడు సార్లు ఔటయ్యాడని గుర్తు చేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడు మొదట్లో నిలదొక్కుకోగలిగితే ఆ జట్టు బౌలింగ్‌పై పై చేయి సాధిస్తాడని భావించాడు.
ఇక సంజూ శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌కు పరిమితం చేయడం శ్రేయస్ అయ్యర్‌కు దారి చూపేందుకేనని కూడా శ్రీకాంత్ భావించాడు. సంజూ శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోందన్నాడు. అయితే మిడిల్ ఆర్డర్‌లో అతడు ఎక్కువగా పరుగులు చేయలేదని.. ఐదో స్థానంలో అతడు ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించాడు. ఇది అతడి ఆత్మ విశ్వాసంపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పాడు. ఒకవేళ ఆసియా కప్‌లో సంజూ శాంసన్ రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతే మాత్రం శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉందని వెల్లడించాడు.


