Eng vs Pak 1st Test : బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ జట్టు బ్యాటింగ్ చేసే థృక్పదమే మారిపోయింది. టీ20ల్లోనే కాదు టెస్టుల్లో కూడా ఆ జట్టు బ్యాటర్లు దూకుడే మంత్రంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా కానివ్వండి సిక్సర్లు, బౌండరీలు బాదుతూ ప్రేక్షకులకు కావాల్సిన మజాను అందిస్తున్నారు. ఆ జట్టుకు టెస్టుల్లో లక్ష్యాన్ని నిర్ధేశించాలంటే ప్రత్యర్థి జట్లు ఒకటి కి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి అంటే ఆ జట్టు బ్యాటర్లు ఎంతగా భయపెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
దాదాపు 17 ఏళ్ల విరామం తరువాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ రావల్పిండి వేదికగా నేడు(గురువారం) మొదలైన తొలి టెస్టులో దుమ్ములేపింది. చూస్తున్న ప్రేక్షకులు ఇది టెస్టు మ్యాచా లేక టీ20 మ్యాచా అని అనుకునేంతలా ఇంగ్లీష్ బ్యాటర్లు బౌండరీలతో విరుచుకుపడ్డారు. నలుగురు బ్యాటర్లు శతకాలు బాదడంతో తొలి రోజునే ఇంగ్లీష్ జట్టు రికార్డు స్కోర్ సాధించింది. మొదటి రోజు 75 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లాండ్ ఓవర్‌కు 6.75 రన్‌రేట్ చొప్పున 506 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి పాక్ బౌలర్లు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే ఆ జట్టు బ్యాటర్లు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ను తలపించేలా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు బెన్ డకెట్(107; 110 బంతుల్లో 15 ఫోర్లు), జాక్ క్రాలే (122 ; 111బంతుల్లో 21 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ఓలీపోప్(108; 104 బంతుల్లో 14 ఫోర్లు), హ్యారీ బ్యూక్(101 నాటౌట్; 81 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. సౌద్ షకీల్ వేసిన 68 ఓవర్‌లో హ్యారీ బ్రూక్ 6 బంతులను ఫోర్లుగా మలిచాడు. ఆట ఆఖర్లో కెప్టెన్ బెన్‌స్టోక్స్(34; నాటౌట్ 15 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్) విరుచుకుపడ్డాడు.
ఇంగ్లీష్ బ్యాటర్లలో ఒక్క జో రూట్(23; 31 బంతుల్లో 3 ఫోర్లు) మినహా అందరూ రాణించారు. పాక్ బౌలర్లు వికెట్లు తీయలేక నానా అవస్థలు పడ్డారు. రెండో రోజు కెప్టెన్ బెన్‌స్టోక్స్‌తో పాటు హ్యారీ బ్యూక్‌ను ఎంత త్వరగా పెవిలియన్‌కు చేరిస్తే పాక్ కు అంత మంచింది. లేదంటే మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకోవాల్సిందే.