Gautham Gambhir: టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ లండన్‌లోని ఓవల్ క్రికెట్ స్టేడియంలో వాదనలో పాల్గొన్న ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్‌తో ఆయనకు ముదిరిన మాటల తూటాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. జులై 31 నుంచి జరిగే ఐదో టెస్టును ముందస్తుగా ట్రైనింగ్ చేస్తున్న సమయంలో ఈ వివాదం చోటు చేసుకుంది.
ఇప్పటికే ఇండియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అందులో ఇంగ్లాండ్‌కు రెండు గెలుపులు, భారత్‌కు ఒకటి, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తుది టెస్టు ఓవల్‌లో జరగనుండగా, భారత్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో జట్టుతో కలిసి గంభీర్ నెట్స్‌లో పర్యవేక్షణలో ఉన్న సందర్భంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నీవు కేవలం మైదాన సిబ్బందివే…
నెట్స్‌లో గంభీర్ ఆటగాళ్లతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయిస్తుండగా పక్కనే ఉన్న లీ ఫోర్టిస్ అక్కడికి వచ్చి ఏదో సూచించినట్లు తెలుస్తోంది. ఆ సూచనతో గంభీర్ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. వీడియోల ప్రకారం గంభీర్ క్యూరేటర్‌ను తీవ్రంగా హెచ్చరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన పద్దతిని తేలిగ్గా తీసుకోని గంభీర్, నీవు కేవలం మైదాన సిబ్బందివే, టీమ్ ఇండియాకు సూచనలు అవసరం లేదని తేల్చిచెప్పినట్టు వీడియోలో కనిపిస్తోంది.
ఈ వ్యవహారంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మద్యలోకి వచ్చి పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేశారు. క్యూరేటర్‌ను పక్కకు తీసుకెళ్లినా, వాగ్వాదం అక్కడితో ముగియలేదని తెలుస్తోంది. కొంతసేపు మాటల యుద్ధం కొనసాగిన అనంతరం పరిస్థితి ప్రశాంతంగా మారింది.
Also Read:https://teluguprabha.net/sports-news/ashwin-praises-gill-for-century-but-criticizes-captaincy/
ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవడంతో అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు స్పందిస్తున్నారు. గంభీర్ తన సూటిగా మాట్లాడే ప్రవర్తనతో గతంలోనూ వార్తల్లోకెక్కిన సందర్భాలు ఉన్నాయి. టీమ్ ఇండియా ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో నూతన ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేస్తున్న గంభీర్, ఈ సంఘటనలో మాత్రం వార్తల్లోకి మళ్లీ వస్తున్నాడు.
ఇది తొలిసారి కాదు. గంభీర్ గతంలో ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇప్పుడు ఆయన కోచ్‌గా ఉండటంతో ఈ సంఘటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఓవల్ స్టేడియం భారత ఆటగాళ్లకు సంతృప్తికరంగా లేకపోతే, క్యూరేటర్ సూచనలు చేయడం సహజమే కానీ, ఆ సూచనల పట్ల గంభీర్ స్పందన ఆసక్తికరంగా మారింది.


