భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్థాన్‌తో ఉన్న క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని, ఇకపై ఏ టోర్నమెంటులోనూ పాక్‌తో తలపడకూడదని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రతి ఏడాది ఇటువంటి ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇది జోక్ కాదని.. ఉగ్రవాదాన్ని సమర్థించడం, ఓర్పు చూపించడం అవసరం లేదన్నారు.. భారత్ ఇప్పుడు గట్టి నిర్ణయం తీసుకోవాలని అని గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్న దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు ఉప్పొంగుతున్నాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫోర్స్ ఈ హత్యాకాండకు పాల్పడినట్టు తెలిసింది. ఈ సంఘటనతో భారత్-పాక్ సంబంధాలు మరింత ఉద్రిక్తమయ్యాయి. ఈ దాడిని భారత క్రికెటర్లు తీవ్రంగా ఖండించినప్పటికీ, పాకిస్తాన్ క్రికెటర్ల నుంచి మద్దతు పలికినవారి సంఖ్య తక్కువ. కేవలం డానిశ్ కనేరియా మాత్రమే స్పందించాడు.
ఇప్పటికే భారత జట్టు పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడడం లేదు. చివరిసారిగా 2008లో భారత్ పాక్‌లో మ్యాచ్‌లు ఆడింది. తరువాత 2012–13లో భారత్ వేదికగా చివరి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి పరస్పర సుదీర్ఘ సిరీస్‌లు నిలిచిపోయాయి. భారత్-పాక్ క్రికెట్ సాంప్రదాయం క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో పాక్‌తో అన్ని క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని భావన పెరుగుతోంది.
మరోవైపు, భారత్ క్రీడల్లో టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్ వంటి రంగాలలోనూ పురోగతి సాధించినప్పటికీ, పాకిస్తాన్ మాత్రం ప్రధానంగా క్రికెట్ మీదే ఆధారపడి ఉంది. తాజాగా, పాక్ క్రికెట్ ఫార్మ్ కూడా క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా పాక్ జట్టు పెద్దగా రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో, సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలు భారత్‌లో ఎక్కువ మద్దతు సంపాదిస్తున్నాయి. క్రికెట్‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలనే డిమాండ్ మరింత బలపడుతోంది.