Fifa World Cup 2022 : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022లో జర్మనీకి ఊహించని షాక్ తగిలింది. నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఈ జట్టు కనీసం నాకౌట్ దశకు చేరకుండానే గ్రూప్ స్టేజీ నుంచే ఇంటి ముఖం పట్టింది. తమ చివరి మ్యాచ్‌లో కోస్టారికాను 4-2 తేడాతో జర్మనీ ఓడించింది. అయినప్పటికీ మరో మ్యాచ్‌లో జపాన్ చేతిలో స్పెయిన్ ఓడిపోవడంతో జర్మనీ ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.
జర్మనీ గ్రూప్-ఇలో ఉంది. ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు గెలిచిన జపాన్ ఆరుపాయింట్లతో గ్రూప్-ఇ టాపర్‌గా నాకౌట్‌కు దూసుకువెళ్లింది. ఇక ఒక్కో విజయం సాధించిన జర్మనీ, స్పెయిన్ లు రెండేసీ పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే.. గోల్స్ విషయంలో స్పెయిన్(9) కంటే జర్మనీ(6) తక్కువగా ఉండడంతో జర్మనీ ఇంటి ముఖం పట్టింది. ఒకవేళ స్పెయిన్ కనుక జపాన్‌ను ఓడించి ఉంటే రౌండ్-16 దశకు జర్మనీ, స్పెయిన్ అర్హత సాధించేవి. ఎందుకంటే జపాన్ ఖాతాలో నాలుగు గోల్స్ మాత్రమే ఉన్నాయి.
ఇక తమ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో జర్మనీ అభిమానులు మండిపడుతున్నారు. ఆ జట్టు మేనేజర్ హాన్సీ ఫ్లిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. 2018 ప్రపంచకప్‌లో సైతం జర్మనీ ఇలానే గ్రూప్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టింది. నాలుగు సార్లు ఛాంపియన్ అయిన జర్మనీ గత రెండు ప్రపంచకప్‌లలో నాకౌట్స్‌కు చేరకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.