HomeఆటHockey : హాకీ ప్రపంచకప్‌ విజేతగా జర్మనీ.. నాలుగోసారి టైటిల్‌ను ముద్దాడిన డిఫెండింగ్‌ చాంపియన్‌!

Hockey : హాకీ ప్రపంచకప్‌ విజేతగా జర్మనీ.. నాలుగోసారి టైటిల్‌ను ముద్దాడిన డిఫెండింగ్‌ చాంపియన్‌!

వావ్రే ( తెలుగు ప్రభ ) : డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీ మరోసారి ప్రపంచ హాకీలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఎఫ్‌ఐహెచ్‌ పురుషుల హాకీ ప్రపంచకప్‌ ఫైనల్లో స్పెయిన్‌ను 1–0తో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ విజయంతో నాలుగు ప్రపంచకప్‌ టైటిళ్లతో పాకిస్థాన్‌ పేరిట ఉన్న రికార్డును జర్మనీ సమం చేసింది. తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లూ పటిష్టమైన రక్షణతో ఆడటంతో గోల్‌ నమోదు కాలేదు.

- Advertisement -

పెనాల్టీ కార్నర్‌లు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో విరామ సమయానికి స్కోరు 0–0గా నిలిచింది. మూడో క్వార్టర్‌లో స్పెయిన్‌ దాడులు పెంచినా జర్మనీ డిఫెన్స్‌ సమర్థంగా అడ్డుకుంది. 44వ నిమిషంలో మిషెల్‌ స్ట్రుత్‌హాఫ్‌ ఓపెన్‌ ప్లేలో గోల్‌ చేసి జర్మనీకి ఆధిక్యాన్ని అందించాడు. చివరి క్వార్టర్‌లో స్పెయిన్‌ సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. నాలుగు నిమిషాలు మిగిలి ఉండగా గోల్‌కీపర్‌ లూయిజ్‌ కల్జాడోను తొలగించి అదనపు ఆటగాడితో దాడికి దిగినా ఫలితం లేకపోయింది. జర్మనీ రక్షణను ఛేదించలేకపోవడంతో విజయం జర్మనీదైంది. జర్మనీ 2002, 2006, 2023 తర్వాత తాజాగా నాలుగోసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 1998 తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేరిన స్పెయిన్‌కు తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ అందని ద్రాక్షగానే మిగిలింది. కాంస్య పతక పోరులో అర్జెంటీనా 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టొమాస్‌ డొమెన్‌ 41వ నిమిషంలో అర్జెంటీనాకు ఆధిక్యం ఇవ్వగా.. ఫ్లోరిస్‌ మిడ్డెన్‌డార్ప్‌ 49వ నిమిషంలో స్కోరును సమం చేశాడు. 59వ నిమిషంలో కెప్టెన్‌ మథియాస్‌ రే పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనాకు కాంస్య పతకాన్ని అందించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News