ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బోణీ కొట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 46.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. శుభ్‌మన్ గిల్ సెంచరీతో పాటు, రోహిత్, కేఎల్ రాహుల్ రాణించడంతో.. భారత్ 46 ఓవర్లలో 4 వికెట్ల నష్టపోయి ఛేదించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ రెండు వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లు చెరో వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్ లో తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం అందించారు. ఆరంభంలో ఆచి తూచి ఆడిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ క్రమంగా జోరు అందుకున్నాడు. బౌండరీతో హోరెత్తించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతడు తస్కిన్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు యత్నించి రిషద్ హొస్సేన్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. తొలి వికెట్‌కు రోహిత్, గిల్ జోడి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక వన్ డౌన్ లో కోహ్లీ (22) తో ఇన్నింగ్స్ ముందుకు నడిపించేందుకు గిల్ ప్రయత్నించాడు.
అయితే రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించిన అనంతరం కోహ్లీని రిషద్ హొస్సేన్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆతరువాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) లు విఫలం అయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో గిల్ పాతుకుని పోయాడు. ఇక కేఎల్ రాహుల్ (41) జాగ్రత్తగా ఆడటంతో 46 ఓవర్లలో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. 125 బంతుల్లో గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో గిల్‌కు ఇది ఎనిమిదో శతకం.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో తౌహిద్ హృదయ్ (100) సెంచరీతో చెలరేగాడు. జాకర్ అలీ (68) హాఫ్ సెంచరీతో రాణించాడు. నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించాడు.