Rohit Sharma : టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త. కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో హిట్‌మ్యాన్ బొటన వేలుకి గాయమైన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకునేందుకు అతడు ముంబైకి వచ్చాడు. దీంతో అతడు మూడో వన్డేతో పాటు తొలి టెస్టుకు దూరం అయ్యాడు. అయితే.. డిసెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టు నాటికి రోహిత్ జట్టుతో కలవనున్నాడని సమాచారం. రోహిత్ శర్మ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. (ఎన్‌సీఏ) అతడు ఫిట్‌నెస్ పరీక్ష పాసైనట్లు ఓ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధికారి తెలిపారు.
రెండో వన్డేలో రోహిత్ గాయంతో బాధపడుతూనే టీమ్ఇండియాను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హిట్‌మ్యాన్ 28 బంతుల్లో 3 పోర్లు, 5 సిక్సర్లు బాది 51 పరుగులు చేశాడు. టీమ్ఇండియా గెలవాలంటే ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా ముస్తాఫిజుర్ అద్భుతమైన యార్కర్‌తో రోహిత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే.. రోహిత్ జట్టులో చేరితే తుది జట్టులో ఎవరిని తప్పిస్తారు అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మినహా అందరూ రాణించారు. గిల్, పుజారాలు సెంచరీలు చేయగా పంత్, శ్రేయస్ అయ్యర్‌లు సైతం మంచి ప్రదర్శనే చేశారు. దీంతో గత కొంతకాలంగా విఫలం అవుతున్న కేఎల్ రాహుల్‌ను తప్పిస్తారా..? లేక సెంచరీ చేసినప్పటికి రోహిత్ కోసం యువ ఆటగాడు శుభ్‌మన్ తన స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుందా..? అన్నది తెలియాల్సి ఉంది.