శనివారం నుంచి ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ ప్రారంభంకానుంది. దీంతో యావత్ క్రికెట్ అభిమానులకు రెండు నెలల పాటు ఫుల్ మజా అందనుంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఎక్స్ ఏఐ సేవలు అందిస్తున్న గ్రోక్(Grok)ను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ఐపీఎల్ 2025 టోర్నీ ఎవరు గెలుస్తారని అడగగా.. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రోక్ సమాధానం ఇచ్చింది.
‘2025 సీజన్ ఇంకా ప్రారంభం కాలేదు. సీజన్ మొదటి మ్యాచ్ మార్చి 22న కోల్‌కతా, బెంగళూరు మధ్య జరగనుంది. టోర్నీ ఆరంభం ముందే విన్నర్ ఎవరో చెప్పడం అసాధ్యం. జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల ఫామ్, గాయాలు, వ్యూహాత్మక నిర్ణయాలు వంటి అనేక అంశాలపై ఫలితం ఆధారపడి ఉంటుంది. గత చరిత్ర, ఇటీవల జరిగిన మెగా వేలం, ప్రస్తుత ఫామ్ ఆధారంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ముంబై కాస్త ముందు వరుసలో ఉంది’ అని పేర్కొంది.
‘రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ పటిష్టంగా ఉంది. ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లతో చెన్నై సూపర్ కింగ్స్ కూడా బలంగానే ఉంది. 2024లో టైటిల్‌ను గెలుచుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా పోటీలో ఉంది. శ్రేయాస్ అయ్యర్ కొనుగోలుతో పంజాబ్ కింగ్స్, రిషబ్ పంత్‌తో లక్నో సూపర్ జెయింట్స్ కూడా బలమైన పోటీదారులుగా కనిపిస్తున్నాయి’ అంటూ గ్రోక్ అభిప్రాయపడింది.