SRH vs GT IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠభరిత మ్యాచులో గుజరాత్ జట్టు అద్భుత విజయం సాధించింది. జీటీ బౌలర్ల అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఏకంగా 82 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టుపై గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. ఎస్‌ఆర్‌హెచ్ మూడో స్థానానికి పడిపోయింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తొలుత టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయినా ఆ స్వల్ప స్కోరును కాపాడుకోవడంలో గుజరాత్ బౌలర్లు ఘన విజయం సాధించారు. ఆరంభం నుంచే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు పరుగుల కట్టడి చేసినా.. సాయి సుదర్శన్ 61(44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ 50(33 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. నిశాంత్ సింధు(22) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. ఇక హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ తలో 2 వికెట్లు తీశారు. ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: https://teluguprabha.net/telangana/bandi-sanjay-sensational-comments-2/
169 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఆరంభంలోనే చిక్కుల్లో పడింది. గుజరాత్ బౌలర్లు కగిసో రబాడ, జాసన్ హోల్డర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పవర్ ప్లేలోనే టాప్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. ట్రావిస్ హెడ్ డకౌట్, అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(11) వరుసగా పెవిలియన్ చేరారు. వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో క్లాసెన్(14) క్రీజులో రాణిస్తుండగా.. అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే హోల్డర్ బౌలింగ్‌లో బట్లర్ క్యాచ్‌తో క్లాసెన్ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ చేజారిపోయింది. సలీల్ అరోరా(16) తన వంతు కృషి చేశాడు. ఆ కాసేపటికే ప్యాట్ కమిన్స్(19) ఔట్ అయ్యాడు. దీంతో 14.5 ఓవర్లకే ఎస్ఆర్‌హెచ్ ఆలౌట్ అయి 86 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో రబాడ, హోల్డర్ చెరో మూడు వికెట్లు, ప్రసిధ్ కృష్ణ 2, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు.

