ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రతి పోరూ రసవత్తరంగా జరుగుతోంది. ఇవాళ మరో కీలక పోరుకు గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈ రోజు రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించి.. మంచి ఊపు మీద ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉండగా, నెట్ రన్‌రేట్ +1.031తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. తమ విజయ పరంపరను కొనసాగించాలని గుజరాత్ టైటాన్స్ చూస్తోంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌ను వరుసగా రెండు ఓటములతో మొదలుపెట్టింది. కానీ ఆ తరువాత వరుసగా రెండు గెలుపులు నమోదు చేసి జోరు అందుకుంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్ జట్టు, గుజరాత్‌పై విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలన్న లక్ష్యంతో ఉంది. పిచ్‌పై దృష్టి సారిస్తే… నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ సమతుల్యంగా ఉండే అవకాశముంది. మొదట్లో బౌలర్లకు సహకరించినా, తర్వాత బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ ఈ స్టేడియంలో 18 మ్యాచ్‌లు ఆడి వాటిలో 10 విజయాలు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు జరగ్గా, వాటిలో ఐదు గుజరాత్ గెలవడం గమనార్హం. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న ఈ పోరు అభిమానులను కట్టిపడేసేలా ఉండనుంది. ఒకవైపు గుజరాత్ తన గెలుపు జోరును కొనసాగించాలని చూస్తుంటే, మరొవైపు రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం కోసం పంజాబ్ చూస్తోంది.