Harbhajan Singh| టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) గురించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీతో తనకు మాటల్లేవంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తరపున ఆడినప్పుడు కూడా పరిమితంగానే మాట్లాడుకునే వాళ్లమని వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో ధోనీ గురించి భజ్జీ ఏం చెప్పారంటే..
“ధోనీకి, నాకు మాటల్లేక 10 సంవత్సరాలు దాటింది. ధోనీతో ఏ సమస్య లేదు. అతనే మాట్లాడటం లేదు. నేను సీఎస్కే తరఫున ఆడుతున్నప్పుడు కూడా పరిమితంగానే మేము మాట్లాడుకున్నాము. అది కూడా గ్రౌండ్ వరకే. అతను నా గదిలోకి రాలేదు. నేను కూడా అతని గదిలోకి వెళ్లలేదు. నేనెప్పుడూ ధోనీకి ఫోన్ చేయను. నా కాల్స్‌కి ఎవరైతే స్పందిస్తారో వారికే చేస్తాను. స్నేహితులుగా ఉన్న వారితో టచ్‌లో ఉంటాను. సంబంధం అనేది ఎల్లప్పుడూ ఇరువురిపై ఆధారపడి ఉంటుంది. మనం ఎదుటివారిని గౌరవిస్తే వారి నుంచి కూడా అదే ఆశిస్తాం. యువరాజ్, ఆశిష్ నెహ్రాతో టచ్‌లో ఉంటాను” అని భజ్జీ తెలిపారు. దీంతో ప్రస్తుతం భజ్జీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్లలో హర్భజన్ కూడా సభ్యుడిగా ఉన్నారు.