Jaganmohan Rao : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 1 లక్ష వ్యక్తిగత బాండ్, రెండు షూరిటీలతో ఆయనకు బెయిల్ లభించింది. జూన్ 2025లో ఐపీఎల్ 2025 సీజన్‌లో టికెట్‌ల అక్రమాలకు సంబంధించి CID ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫిర్యాదు మేరకు జగన్‌మోహన్ రావుపై బ్లాక్‌మెయిల్, టికెట్‌ల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.
ALSO READ: Daniil madvedev: యూఎస్ ఓపెన్: డానిల్ మెద్వెదెవ్‌కు భారీ జరిమానా..!
తెలంగాణ హైకోర్టు జగన్‌మోహన్ రావును బెయిల్‌పై విడుదల చేస్తూ, కేసు విచారణలో సహకరించాలని, హైదరాబాద్‌ను విడిచి వెళ్లకూడదని షరతులు విధించింది. అలాగే, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఆధారాలతో జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది. ఈ బెయిల్ నిర్ణయం HCAలో అవినీతి, టికెట్‌ల అక్రమ విక్రయాలపై చర్చను మరింత రేకెత్తించింది.
జగన్‌మోహన్ రావు అరెస్టు నేపథ్యంలో, SRH యాజమాన్యం HCAపై తీవ్ర ఆరోపణలు చేసింది. HCAకు ఇచ్చిన 3,900 కాంప్లిమెంటరీ టికెట్‌లతో పాటు, అదనంగా 2,500 టికెట్‌లను రావు డిమాండ్ చేశారని, లేనిపక్షంలో మ్యాచ్‌లను అడ్డుకుంటామని బెదిరించారని SRH తెలిపింది. ఈ ఘటన మార్చి 27, 2025న SRH vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా తీవ్రస్థాయిలో వెలుగులోకి వచ్చింది. HCA ఆఫీస్‌లో జగన్‌మోహన్ రావు అక్రమంగా ఎన్నికైనట్లు CID విచారణలోనూ వెల్లడైంది.
మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ HCAలో అవినీతిని బయటపెట్టాలని, ప్రస్తుత యాజమాన్యాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బెయిల్ నిర్ణయం క్రికెట్ సర్కిల్స్‌లో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగా, HCA గవర్నెన్స్‌పై సంస్కరణల అవసరం గురించి చర్చలు ఊపందుకున్నాయి.


