క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం సమ్మర్ కోచింగ్ క్యాంప్ ల ముఖ్య ఉద్దేశ్యమని జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఆధునిక, సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారుల్లో నైపుణ్యతను మరింత పెంపొందించే దిశగా ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. వేసవి శిక్షణ శిబిరం సందర్భంగా 44 క్రీడలలో ప్రాచుర్యం పొందిన ఆధునిక క్రీడా క్రికెట్ పోటీలు నగర వ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాలలో నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో క్రికెట్ క్యాంపులకు విశేష స్పందన వస్తోంది. క్రికెట్ క్యాంపులకు అత్యధిక మంది విద్యార్థులు హాజరై, ఆటను ఆస్వాదిస్తున్నారు. ప్రత్యేక సమ్మర్ కోచింగ్ క్యాంప్ లు నగర వ్యాప్తంగా ఉన్న 353 క్రీడా మైదానాలు గల 915 ప్రదేశాలలో వివిధ క్రీడలు, ఆటల పోటీలలో 6 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలు పాల్గొని క్రమశిక్షణను అలవార్చుకుంటూ క్రీడా స్ఫూర్తి కొనసాగిస్తున్నారు.
క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో భాగంగా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో స్పోర్ట్స్ క్విజ్ నిర్వహించారు. క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి జ్ఞాపికను అందజేశారు.