వేసవి సెలవులను విద్యార్ధులు సద్వినియోగం చేసుకొనేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను సమ్మర్ క్యాంప్ లలో చేర్పించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బేగంపేటలోని జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నగరంలోని ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని అన్ని పార్క్ లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో బేగంపేట, అమీర్‌పేట, సనత్ నగర్ లలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని, ఈ వేసవి సెలవులలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ప్రజలలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో మరింత శ్రద్ధ పెరిగిపోయిందని, యోగా, వాకింగ్, జిమ్ వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారని వివరించారు. స్విమ్మింగ్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. అనంతరం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలోని జిమ్ ను సందర్శించి పరిశీలించారు. జిమ్ లో నూతన పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరగా, వెంటనే అత్యాధునిక నూతన పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా టాయిలెట్స్ ను కూడా అవసరమైన మరమ్మతులు చేపట్టి పునరుద్దరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ సుదర్శన్, నాయకులు శ్రీహరి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.