ICC New Rules: క్రికెట్ ఆటను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఐసీసీ కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. ఇప్పటికే వన్డే ఫార్మాట్ లో కొన్ని నిబంధలను మార్చింది. తాజాగా టీ20 మ్యాచ్ లకు సంబంధించి పవర్ ప్లే ఓవర్లలోనూ మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పుల ప్రకారం వర్షం లేదా ఇతర కారణాలతో ఓవర్లను కుదించిన సమయంలో పవర్ ప్లే ఓవర్లను కచ్చితంగా లెక్కించనున్నారు. ఈ సమయంలో 30 యార్డు సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది.
గతంలో ఇలాంటి మ్యాచ్ ల విషయంలో రౌండ్ ఫిగర్ గా ఓవర్లు ఉండేవి. కానీ ఇప్పుడు కచ్చితంగా 30శాతం పవర్ ప్లే ఓవర్లు ఉండేలా రూల్స్ మార్చింది. ఈ మార్పుల వల్ల ఫీల్డింగ్ విషయంలో అన్ని జట్లకు సమాన అవకాశాలు లభిస్తాయని ఐసీసీ పేర్కొంది. ఈ కొత్త పవర్‌ప్లే నిబంధనలు జూలై నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
5 ఓవర్ల ఆటకు 1.3 ఓవర్లు, 6 ఓవర్ల మ్యాచ్‌కు: 1.5 ఓవర్లు, 7 ఓవర్ల ఆటకు 2.1, 8 ఓవర్ల ఆటకు 2.2, 9 ఓవర్ల ఆటకు 2.4, 10 ఓవర్ల మ్యాచ్‌కు: 3.0 ఓవర్లు, 11 ఓవర్లకు 3.2 ఓవర్లు, 12 ఓవర్ల మ్యాచ్‌కు: 3.4 ఓవర్లు, 13 ఓవర్లకు 3.5, 14 ఓవర్లకు 4.1, 15 ఓవర్లకు 4.3, 16 ఓవర్ల మ్యాచ్‌కు: 4.5 ఓవర్లు, 17 ఓవర్లకు 5.1, 18 ఓవర్లకు 5.2 , 19 ఓవర్ల ఆటలకు 5.4 ఓవర్ల పవర్ ప్లే జరపాలని నిర్ణయించింది.
అలాగే టెస్టుల్లోనూ స్లో ఓవర్ రేట్ సమస్యను అరికట్టేందుకు స్టాప్ క్లాక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఒక ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ జట్టు 60 సెకన్ల లోపు తర్వాతి ఓవర్‌ను ప్రారంభించాలి. ఈ నిబంధనను ఫీల్డింగ్ జట్టు మూడు సార్లు ఉల్లంఘిస్తే బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీగా లభిస్తాయి. అంతేకాకుండా బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీస్తే తర్వాతి బంతిని ఎవరు ఆడాలో నిర్ణయించే హక్కు ఫీల్డింగ్ కెప్టెన్‌కు కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌తో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.