ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోని మొదటి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టుకు షాక్ తగిలింది. కరాచీ వేదికగా జరిగిన తొలి పోరులో న్యూజిలాండ్ జట్టు పాక్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 320 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం 321 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు.. రన్స్ చేయడంలో మొదటి బంతి నుంచి ఇబ్బంది పడింది. బాబర్ అజామ్ 64, సల్మాన్ అగా 42, కుషి అదిల్ షాహ్ 69 పరుగులు మినహా ఎవరూ అంతగా రాణించలేదు. దీంతో పాక్ జట్టు 47.2 ఓవర్లకు 260 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచులోనే భారీ విజయం సాధించింది. ఈ మ్యాచులో న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 2, విలియమ్ 3, మిచెల్ శాంట్నర్ 3, నాతన్ స్మిత్ 1 వికెట్ తీసుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు.. ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. డేవాన్ కాన్వే , కేన్ విలియమ్సన్ , డారిల్ మిచేల్ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. ఒక దశలోనే 73 పరుగులకే మూడు వికెట్లు కోల్పోడంతో.. పాకిస్తాన్ పైచేయి సాధించినట్టే అనిపించింది. అయితే విల్ యంగ్, టామ్ లాథమ్ లు కివీస్ ను ఆదుకున్నారు. ఇద్దరు సెంచరీలతో కదం తొక్కారు. దాంతో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించగలిగింది.
విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 107 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్ స్కోరును పరుగెత్తించారు. ఈ క్రమంలోనే లాథమ్ సైతం సెంచరీ చేయగా.. ఫిలిఫ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యంగ్-లాథమ్ జోడీ నాలుగో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత లాథమ్-ఫిలిప్ జోడీ సైతం ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. లాథమ్ 103 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 104 పరుగులు చేసి 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫిలిఫ్ 39 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేయడంతో భారీ స్కోర్ సాధించారు. ఇక 118 పరుగులు చేసిన లాథమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.