ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో.. సౌతాఫ్రికా విజయం సాధించింది. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది దక్షిణాఫ్రికా. రియాన్ రికెల్టన్ సెంచరీతో పాటు భవుమా, వాన్ డెర్ దుస్సేన్, అయిడిన్ మార్క్‌రమ్ హాఫ్ సెంచరీలతో రాణించి.. దీంతో ఆ జట్టు 315 పరుగుల భారీ స్కోరు అందించారు. ఈ లక్ష్యఛేదనలో ఆఫ్గానిస్తాన్ జట్టు 43.3 ఓవర్లలో 208 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. టోనీ డే జోర్జీ తక్కువ పరుగులకే అవుట్ అయినా.. భవుమా, రియాన్ రికెల్టన్ కలిసి రెండో వికెట్‌కి 129 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కెప్టెన్ భవుమా 58 పరుగులు చేశాడు.. అనంతరం భవుమాని నబీ అవుట్ చేశాడు. అయితే రియాన్ రికెల్టన్ వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ బాదాడు. 106 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 103 పరుగులు చేసిన రియాన్ రికెల్టన్ రనౌట్ అయ్యాడు. వీరితో పాటు.. వాన్ డెర్ దుస్సేన్, మార్క్‌రమ్ హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో 315 పరుగుల భారీ స్కోర్ చేశారు.
మరోవైపు 316 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగుతున్నట్టుగా కనిపించలేదు. రెహ్మనుల్లా గుర్భాజ్ 10 పరుగులు చేయగా ఇబ్రహీం జాద్రాన్ 17 పరుగులు చేశాడు. సదీకుల్లా అతల్ 16 పరుగులు చేయగా కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ డకౌట్ అయ్యాడు.
అజ్మతుల్లా ఓమర్‌జాయ్ 18 పరుగులు, మహ్మద్ నబీ 8, గుల్బద్దీన్ నయీబ్ 13, రషీద్ ఖాన్ 18 పరుగులు, నూర్ అహ్మద్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన రెహ్మత్ షా 92 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 90 పరుగులు చేసి, ఆఖరి వికెట్‌గా అవుట్ అయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా 3 వికెట్లు తీయగా లుంగి ఇంగిడి, వయాన్ ముల్దార్ రెండేసి వికెట్లు తీశారు. మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్ చెరో వికెట్ తీశారు.