T20 Wc SL vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. అయినప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో గ్రూప్- 2 నుంచి న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించడంతో పాక్ ఆశలు ఆవిరయ్యాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. ఇప్పటికే గ్రూప్- 2 నుంచి ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు చేరుకోగా.. రెండో సెమీస్ బెర్తును న్యూజిలాండ్ దక్కించుకుంది. ఈ రోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినప్పటికీ.. నెట్ రన్ రేటు విషయంలో న్యూజిలాండ్ మెరుగ్గా ఉండటంతో పాక్ ఇంటి ముఖం పట్టింది.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉంది. అయితే లంక బ్యాటర్లు 15.5 ఓవర్ల వద్ద 148 పరుగుల మార్కును చేరుకుంది. దీంతో ఇన్నింగ్స్ ముగియకముందే పాక్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.
ఇక, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయినప్పటికీ, పాక్ తన చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవలేదు. దీంతో న్యూజిలాండ్ మెరుగైన రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక న్యూజిలాండ్ తన సెమీఫైనల్ మ్యాచ్‌లో భాగంగా మార్చి 4న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గ్రూప్ 2 నుండి ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.

