Bismillah Jan Shinwari: అంతర్జాతీయ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఐసీసీ ప్యానెల్ అంపైర్ బిస్మిల్లా జన్ షిన్వారీ 41 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఆఫ్ఘనిస్థాన్ దేశానికి చెందిన షిన్వారీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ ఎలైట్ అంపైరింగ్ ప్యానెల్‌లో గౌరవనీయ సభ్యురాలు బిస్మిల్లా జాన్ షిన్వారీ మరణంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంది. షిన్వారీ అనారోగ్యంతో మరణించారనే వార్త తమకు చాలా బాధ కలిగించిందని తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అఫ్ఘన్ క్రికెట్ బోర్డు హృదయపూర్వక సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులకు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నామని వెల్లడించింది.
మరోవైపు షీన్వార్ మృతి పట్ల ఐసీసీ కూడా తీవ్ర సంతాపం వ్యక్తపరిచింది. ప్రముఖ క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు, అభిమానులు కూడా ఆయన మృతి పట్ల తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఒక మంచి అంపైర్‌ను త్వరగా కోల్పోయామని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Also Read: ఆర్సీబీ బౌలర్‌కు భారీ షాక్- 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదా?
1984లో అప్ఘాన్‌లో జన్మించిన షిన్వారీ 2017లో ఐసీసీ ప్యానెల్ అంపైరింగ్‌కి ఎంపికయ్యారు. ఐర్లాండ్-అఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా అంపైరింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. తన కెరీర్‌లో మొత్తం 60 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో 34 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. కాగా షిన్వారీ కటుంబం 2020లో నగర్హర్ ఫ్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడింది.


