Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ధోని నాయకత్వంలో సీఎస్‌కే జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఈ జట్టుకు ధోనినే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతేడాది ఆల్‌రౌండర్ జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే.. అతడు విఫలం కావడంతో తిరిగి ధోనినే పగ్గాలు అందుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని వయస్సు 41 సంవత్సరాలు. ఐపీఎల్ 2023 సీజన్ తరువాత ధోని అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెబుతాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కూడా ధోని అనుభవాన్ని, వ్యూహా చతురతను ఉపయోగించుకోవాలనే ఆసక్తితో ఉంది. ఇక ధోని వయస్సు దృష్ట్యా కూడా మరో సీజన్ ఆడేది అనుమానమే. దీంతో భవిష్యత్తులో చెన్నై కెప్టెన్సీ బాధ్యతలను ఎవరు తీసుకుంటారు అనే అంశం ఆసక్తిగా మారింది. ధోని వారసుడి కోసం చెన్నై జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటి కే వేట మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
కెప్టెన్సీ రేసులో అందరికి కంటే ముందు వినిపిస్తున్న పేరు రుతురాజ్ గైక్వాడ్. ప్రస్తుతం ఇతడు దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ రుతురాజ్ మరీ యువకుడు అనుకుంటే ధోని పాత్రకు న్యాయం చేయగల ముగ్గురు అనుభవజ్ఞులు ఉన్నారు. వారెవరో ఓ సారి చూద్దాం.
డ్వేన్ బ్రావో
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టీ20 లీగుల్లో రాణించాడు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. ఇక చెన్నైతో చాలా కాలంగా కలిసి ఉంటున్నాడు. ధోనికి మంచి సన్నిహితుడు కూడా. అయితే.. గతేడాది మెగా వేలానికి ముందు ఈ ఆటగాడిని వేలానికి విడిచి పెట్టిన చెన్నై జట్టు రూ.4.4 కోట్లకు మళ్లీ కొనుగోలు చేసింది. ఈ సారి కూడా అతడిని వదిలి వేసింది. మళ్లీ తక్కువ ధరకు చెన్నై జట్టు బ్రావోను కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించవచ్చు. అతడి వయస్సు 39 సంవత్సరాలు కావడం అతడికి కాస్త ప్రతిబంధకమే. అయితే.. రుతురాజ్ ను కెప్టెన్‌గా మలిచేందుకు కొంత సమయం కావాలి అని అనుకుంటే బ్రావో నే మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు.
బెన్‌స్టోక్స్
ఇంగ్లాండ్ జట్టుకు రెండు(2019 వన్డే, 2022 టీ20) ప్రపంచకప్‌లు అందించడంలో ఈ ఆల్‌రౌండర్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ 31 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు జట్టును ముందుండి నడిపించేందుకు ఇష్టపడుతాడు. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టును మార్చిన విధానమే అతడి నాయకత్వ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం వేలంలో ఈ ఆటగాడిని చెన్నై దక్కించుకుని కెప్టెన్సీ ఇస్తే ధోనిలాగే ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యం అతడి సొంతం.
జాసన్ హోల్డర్
ధోనికి ప్రత్యామ్నాయంగా చెన్నై భావించే మరో పేరు జాసన్ హోల్డర్. వెస్టిండీస్ జట్టు వన్డే, టెస్టు సారథిగా తనని తాను నిరూపించుకున్నాడు. పెద్దగా పేరున్న ఆటగాళ్లు లేనప్పటికీ జట్టులో సమతూకం తీసుకువచ్చి మంచి ఫలితాలను రాబట్టాడు. ఇక ఐపీఎల్‌లో అత్యంత నిలకడగా రాణించే ఆటగాళ్లలో హోల్డర్ ఒకడు. గత సీజన్‌లో లక్నో తరుపున 12 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌తో పాటు ధాటిగా హిట్టింగ్ చేయగల సామర్థ్యం హోల్డర్ సొంతం. దీంతో ఫినిషర్ పాత్రను కూడా పోషించగలడు. ప్రస్తుతం ఈ ఆటగాడు కూడా వేలంలో ఉన్నాడు.