Team India: టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీస్ నుంచే ఇంటి ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో భారత జట్టులో ప్రక్షాళన అవసరం అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించాలని, అతడి స్థానంలో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ ఆటగాడు సల్మాన్ భట్ స్పందించాడు. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ పరుగులు సాధించి ఉంటే అసలు ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వచ్చేవి కాదన్నాడు.
ఓ వైపు ఈ చర్చలు జరుగుతుండగా.. సీనియర్లు లేకుండానే భారత జట్టు కివీస్ పర్యనటకు వెళ్లింది. ఈ పర్యటనకు హార్థిక్ పాండ్యాను తాత్కాలిక కెప్టెన్‌గా సెలక్టర్లు నియమించారు. శనివారం జరగాల్సిన ఉన్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం మౌంట్ మాంగనుయ్ వేదికగా జరగనుంది.
ఐపీఎల్‌లో టైటిల్ సాధిస్తే.. సారథిని చేస్తారా..?
కెప్టెన్సీ మార్పు విషయమై తన యూట్యూబ్ ఛానల్‌లో భట్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఓటమి పాలైనంత మాత్రాన కెప్టెన్సీ మార్పు చేయాలనడం సరికాదన్నాడు. పాండ్యాను కెప్టెన్ గా చూడాలని ఎవరు అనుకుంటున్నారో నాకైతే తెలియదు. అతడు ప్రతిభ కలిగిన ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు. అయితే.. టీమ్ఇండియా లాంటి అగ్రశేణి జట్టును నడిపించడం అంత తేలికైన విషయం కాదు.
అలా చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ సాధించాడు. అయితే.. టీ20 ప్రపంచకప్‌లో విఫలం అయ్యాడు కదా. ఒకవేళ అతడు రెండు లేదా మూడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడి ఉంటే కెప్టెన్సీ మార్పు గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఆసియాలో ఇది ఒక ఆనవాయితిగా మారింది. ఒకటి రెండు సిరీస్‌ల్లో విఫలం అయితే చాలు కెప్టెన్సీ నుంచి తీసేయాలి అనే డిమాండ్లు వినిపిస్తాయి. ఆట గురించి పూర్తి అవగాహన ఉన్న వారు అలా మాట్లాడరు. ఏ ప్రపంచకప్ తీసుకున్నా ఒక కెప్టెనే గెలుస్తాడు. మిగిలిన జట్లు ఓడిపోతాయి. అలా అని ఓటమి పాలైన మొత్తం జట్లలోని కెప్టెన్లను మార్చమంటారా..? ఇవన్నీ అనవసర చర్చలు అని సల్మాన్ భట్ అన్నాడు.