HomeఆటAsian Games: భళా.. భారత్‌.. ఆసియా క్రీడల్లో ఒకేరోజు ఆరు స్వర్ణాలు

Asian Games: భళా.. భారత్‌.. ఆసియా క్రీడల్లో ఒకేరోజు ఆరు స్వర్ణాలు

  •  మహిళల హాకీలో 44ఏళ్ల తర్వాత స్వర్ణం
  •  బాక్సింగ్‌లో హ్యాట్రిక్‌.. ఆర్చరీ, రెజ్లింగ్‌లోనూ పసిడి పతకాలు
  •  ఆర్చరీలో పురుషుల రికర్వ్‌ జట్టు, మిక్స్‌డ్‌ జట్టుకు రజతాలు
  •  సెయిలింగ్‌లో కాంస్యం

నాగోయా/కకమిగహరా/నిషియో, అక్టోబర్‌ 2: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు శుక్రవారం అదరగొట్టారు. హాకీలో మహిళల జట్టు 44ఏళ్ల తర్వాత స్వర్ణం సాధించగా, బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహైన్‌, పర్వీన్‌ హూడా, అంకుశ్‌ పంఘాల్‌ పసిడి పతకాలు అందుకున్నారు. రెజ్లింగ్‌లో సుజీత్‌ కల్కల్‌, మహిళల రికర్వ్‌ ఆర్చరీ జట్టు సైతం స్వర్ణ పతకాలు గెలుచుకున్నాయి. ఆర్చరీలో పురుషుల రికర్వ్‌ జట్టు, మిక్స్‌డ్‌ జట్టు రజతాలు సాధించగా, సెయిలింగ్‌లో నెత్రా కుమనన్‌ కాంస్యం గెలుచుకుంది. దీంతో శుక్రవారం ఒకేరోజు భారత్‌ ఖాతాలో 9 పతకాలు చేరుకోగా.. ఇందులో 6 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం ఉన్నాయి.

- Advertisement -

44 ఏళ్ల నిరీక్షణకు తెర
ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత్‌ 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌, ఒలింపిక్స్‌ రజత పతక విజేత చైనాను 1–0తో ఓడించి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఈ విజయంతో 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ నేరుగా అర్హత సాధించింది. 10వ నిమిషంలో సాక్షి రాణా అందించిన పాస్‌ను అందుకున్న లాల్‌రెమ్సియామి పరుగులోనే రివర్స్‌ స్టిక్‌తో కొట్టిన అద్భుత షాట్‌ నేరుగా గోల్‌పోస్ట్‌ పైభాగంలోకి దూసుకెళ్లింది. చైనా గోల్‌కీపర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారత్‌కు ఆధిక్యం అందించింది. తొలి క్వార్టర్‌లో భారత్‌ దూకుడుగా ఆడగా, చైనా స్వల్పంగా ఎక్కువ బంతి ఆధిపత్యం సాధించినా భారత రక్షణ పటిష్ఠంగా నిలిచింది. రెండో క్వార్టర్‌లో చైనా ఒత్తిడి పెంచింది. 24వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ లభించినా సవితా పునియా అద్భుతంగా అడ్డుకుని భారత్‌ ఆధిక్యాన్ని కాపాడింది.

వరుస పెనాల్టీ కార్నర్లు
విరామం తర్వాత చైనా వరుసగా పెనాల్టీ కార్నర్లు సాధించడంతో భారత రక్షణకు పరీక్ష ఎదురైంది. నవ్‌నీత్‌ కౌర్‌ కీలక గోల్‌లైన్‌ క్లియరెన్స్‌తో సమం చేసే అవకాశాన్ని అడ్డుకుంది. మరోవైపు చైనా గోల్‌ కోసం అన్ని ప్రయత్నాలు చేసింది. మ్యాచ్‌ ముగియడానికి ఐదు నిమిషాల ముందు గోల్‌కీపర్‌ను కూడా వెనక్కి తీసి అదనపు ఆటగాడిని మైదానంలోకి పంపింది. అయినా భారత్‌ రక్షణ కదల్లేదు. ఇషికా చౌదరి, బల్జీత్‌ కౌర్‌, సుశీలా చాను తదితరులు చైనా దాడులను సమర్థంగా అడ్డుకున్నారు. గోల్‌కీపర్‌ బిచు దేవి కూడా కీలక సమయాల్లో గోడలా నిలిచి భారత్‌ ఆధిక్యాన్ని కాపాడింది.

1982 తర్వాత మళ్లీ స్వర్ణం
ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత్‌ చివరిసారిగా 1982లో స్వర్ణం సాధించింది. 1998, 2018లో ఫైనల్‌కు చేరినా రజతంతోనే సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం ఎలాంటి నిరాశకు తావివ్వకుండా చైనాను ఓడించి 44 ఏళ్ల తర్వాత మళ్లీ ఆసియా క్రీడల స్వర్ణాన్ని ముద్దాడింది.

బాక్సింగ్‌లో ట్రిపుల్‌ ధమాకా!
ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు అదరగొట్టారు. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో లవ్లీనా బోర్గోహెయిన్‌ (75 కిలోలు), పర్వీన్‌ హుడా (65 కిలోలు), అంకుష్‌ పంఘాల్‌ (80 కిలోలు) స్వర్ణ పతకాలు సాధించారు. దీంతో ఆసియా క్రీడల బాక్సింగ్‌లో భారత్‌ మూడు పసిడి సహా ఆరు పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రియా ఘంగాస్‌ (60), కపిల్‌ పొఖరియా (90), నరేందర్‌ బెర్వాల్‌ (+90) కాంస్యాలు సాధించారు. పసిడి పతకాల పరంగా ఆసియా క్రీడల్లో ఇదే భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన. 2010 గ్వాంగ్‌జౌలో భారత్‌ మొత్తం తొమ్మిది పతకాలు సాధించినా.. స్వర్ణాలు రెండే. తన 29వ పుట్టినరోజున లవ్లీనా చైనాకు చెందిన జీ బావోను 5–0తో ఓడించి స్వర్ణం అందుకుంది. గత ఆసియా క్రీడల్లో రజతంతో సరిపెట్టుకున్న ఆమె ఈసారి పసిడితో ఆ లోటును తీర్చుకుంది. పర్వీన్‌ హుడా చైనీస్‌ తైపీకి చెందిన పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత చెన్‌ నియెన్‌చిన్‌పై 3–2తో ఉత్కంఠభరిత విజయం సాధించి తొలిసారి ఆసియా క్రీడల స్వర్ణం గెలిచింది. 21ఏళ్ల అంకుష్‌ పంఘాల్‌ పురుషుల 80 కిలోల్లో స్వర్ణం సాధించి సత్తా చాటాడు. కిమ్‌పై తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించిన అంకుష్‌.. చివరి రౌండ్‌లో ఫుట్‌వర్క్‌తో ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి స్ప్లిట్‌ నిర్ణయంతో విజయం సాధించాడు.

ఆర్చరీలో అదుర్స్‌
మహిళల రికర్వ్‌ టీమ్‌ ఫైనల్లో అంకిత భకత్‌, కుమ్‌కుమ్‌ మోహోద్‌, కీర్తి శర్మలతో కూడిన జట్టు దక్షిణ కొరియాను 5-3తో ఓడించి ఆసియా క్రీడల చరిత్రలో ఈ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించింది. పురుషుల రికర్వ్‌ టీమ్‌ ఫైనల్లో భారత్‌ దక్షిణ కొరియా చేతిలో 1-5తో ఓడి రజతంతో సరిపెట్టుకోగా, మిక్స్‌డ్‌ రికర్వ్‌లో ధీరజ్‌ బొమ్మదేవర, కుమ్‌కుమ్‌ మోహోద్‌ జోడీ సైతం చైనాపై ఓడి రజతం సాధించింది.

సుజీత్‌ అద్భుతం.. రెజ్లింగ్‌లో స్వర్ణం
 2–9 నుంచి 10–9కు అద్భుత పునరాగమనం
భారత యువ రెజ్లర్‌ సుజీత్‌ కల్కల్‌ పురుషుల 65 కిలోల విభాగంలో ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో తజికిస్థాన్‌కు చెందిన అబ్దుల్‌మజీద్‌ కుడీవ్‌పై 2–9తో వెనుకబడ్డ సుజీత్‌.. అద్భుతంగా పుంజుకుని వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి 10–9తో విజయం సాధించాడు. తొలుత కుడీవ్‌ 9–2 ఆధిక్యంలోకి వెళ్లినా.. సుజీత్‌ ప్రత్యర్థి బలానికి తన వేగంతో సమాధానమిచ్చాడు. వరుస టేక్‌డౌన్లతో లోటును 8–9కు తగ్గించి, పోటీ ముగియడానికి 20 సెకన్ల ముందు కీలక టేక్‌డౌన్‌ సాధించాడు. అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకుని ఆసియా క్రీడల్లో తొలిసారి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. మహిళల 50 కిలోల్లో 18 ఏళ్ల డిపాన్షి ఫొగాట్‌ కాంస్య పతకానికి చేరువై ఓడిపోయింది. పురుషుల 125 కిలోల్లో రజత్‌ కజకిస్థాన్‌ రెజ్లర్‌ యెడిగే కాసింబెకిన్‌ చేతిలో 3–8తో, మహిళల 76 కిలోల్లో ప్రియా మాలిక్‌ కిర్గిజిస్థాన్‌ రెజ్లర్‌ ఐపెరి మెడెట్‌ కిజీ చేతిలో 1–6తో ఓడి నిష్క్రమించారు. ఇక సెయిలింగ్‌లో మహిళల డింగీ విభాగంలో నెత్రా కుమనన్‌ కాంస్య పతకం సాధించింది. ఇది ఈ ఆసియా క్రీడల్లో సెయిలింగ్‌లో భారత్‌కు మూడో పతకంగా నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News