IND v AUS Highlights, 02nd ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో కూడా టీమ్ ఇండియా ఓటమి పాలైంది. తాజా ఓటమితో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 0-2తో సిరీస్ ను కోల్పోయింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గిల్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కంగూరు టీమ్ లో షార్ట్(74), కాన్లీ(61) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ పిచ్ పై 17 ఏళ్ల తర్వాత భారత్ పై ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ గెలిచింది. నామమాత్రమైన మూడో వన్డే అక్టోబర్ 25న సిడ్నీలో జరగనుంది.
మెరిసిన రోహిత్, శ్రేయస్..
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ కు మంచి ఆరంభం లభించలేదు. ఆదిలోనే గిల్, కోహ్లీ వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను రోహిత్(73), శ్రేయస్(61) అదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ పటేల్(44), హర్షిత్ రాణా(24) కీలక ఇన్నింగ్స్ ఆడారు. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి(8) నిరాశ పరిచాడు. కంగూరు బౌలర్లలో జంపా నాలుగు వికెట్లు, జేవియర్ బార్ట్‌లెట్ మూడు వికెట్లతో సత్తా చాటారు.
Also read: Virat Kohli-అడిలైడ్ లో చివరి వన్డే ఆడేసినట్లేనా.. కోహ్లీ గెశ్చర్ కు అర్థమేంటి?
చెలరేగిన షార్ట్, కాన్లీ..
అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన ఆసీస్ కు కూడా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ మార్ష్ 11 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వగా..ట్రావిస్ హెడ్ 28 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత షార్ట్, రెన్షా మంచి పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన కాన్లీ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడటంతో ఆసీస్ విజయం లాంఛనంగా మారింది. చివర్లో ఓవెన్ మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు 46.2 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. అర్షదీప్, రాణా, సుందర్ రెండేసి వికెట్లు తీశారు. నాలుగు వికెట్లు తీసిన జంపాకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.


