IND vs AUS 01st ODI Highlights: పెర్త్ వన్డేలో భారత్ పై ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన మిచెల్ మార్ష్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. కీలకమైన రెండు వన్డే అక్టోబర్ 23న జరగనుంది.
నిరాశ పరిచిన రోకో..
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియాకు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(8), కెప్టెన్ గిల్ (10) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. స్టార్ బ్యాటర్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. రీఎంట్రీ మ్యాచ్ లో రోకో సరిగా ఆడకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(11) కూడా విఫలమయ్యారు. 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సందర్భంలో మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించారు. అప్పటికే దాదాపు 17 ఓవర్లు పూర్తయ్యాయి.
అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడారు. తక్కువ ఓవర్లే ఉండటంతో బ్యాట్ ఝలిపించారు. మెుదట అక్షర్, తర్వాత రాహుల్ పోటాపోటీగా బౌండరీలు బాదారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మాథ్యూ కూన్హెమన్ విడదీశాడు. 31 పరుగుల చేసిన అక్షర్ ను ఔట్ చేసి ఆసీస్ కు బ్రేక్ ఇచ్చాడు.
చివర్లో నితీష్ మెరుపులు
ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు రాహుల్ నిలకడగా ఆడాడు. వాషింగ్టన్ సుందర్ కూడా కేవలం పది పరుగులే చేసి ఔటయ్యాడు. అనంతరం రాహుల్(38) కూడా భారీ షాట్ కు ప్రయత్నించి వెనుదిరిగాడు. చివరిలో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. డకవర్త్ లూయిస్ ప్రకారం, ఆసీస్ టార్గెట్ ను 131 పరుగులకు కుదించారు.
Also Read: IND vs AUS-భారత్- ఆస్ట్రేలియా హైవోల్టేజ్ పోరు నేడే.. మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
మార్ష్ మార్క్ ఇన్నింగ్స్
ఛేజింగ్ లో ఆసీస్ ను కెప్టెన్ మార్ష్ ఆదుకున్నాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన మార్ష్..ట్రావిస్ హెడ్, షార్ట్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా తాను మాత్రం నిలకడగా ఆడాడు. జోష్ ఫిలిఫ్ప్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. 29 బంతుల్లో 37 పరుగులు చేసి ఫిలిఫ్పి ఔటయ్యాడు. రెన్షా(21)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు మార్ష్. ఆ జట్టు బ్యాటర్లలో మార్ష్ 46 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు.


