IND vs AUS 2025 T20 Series: ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ ఇండియా మరోసారి సత్తా చాటింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 కైవసం చేసుకుని కంగారూలకు ఓటమి రుచి చూపించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో శనివారం జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైంది. సిరీస్‌ను సమం చేయడానికి ఆసీస్ కు ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా వరుణుడు అడ్డుకోవడంతో భారత్ కు సిరీస్ దక్కింది. తాజాగా గెలుపుతో టీమ్ ఇండియా.. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా ఐదో టీ20 సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది.
నవంబర్ 08న బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికగా జరిగిన చివరి మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గిల్, అభిషేక్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గిల్ తన స్వభావానికి విరుద్దంగా బ్యాటింగ్ చేసి కంగారూ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అభిషేక్ శర్మ ఇచ్చిన రెండు సులభమైన క్యాచ్ లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు వదిలేయడంతో అతడు మరింత రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. గిల్ కూడా ఒకే ఓవర్ లో నాలుగు ఫోర్లు కొట్టి తానేమీ తక్కువ కాదనీ నిరూపించాడు. వీరిద్దరి దాటికి టీమ్ ఇండియా 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. గిల్ 29, అభిషేక్ 23 పరుగులతో ఆడుతున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. అది ఎంతకు ఆగకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు.
Also Read: India Pakistan Match – 2028 ఒలింపిక్స్‌లో భారత్-పాకిస్థాన్ పోరు డౌటే
ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆ తర్వాత గొప్పగా పుంజుకున్న టీమ్ ఇండియా వరుసగా రెండు గేమ్స్ నెగ్గింది. చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత్ జట్టు 2-1 తేడాతో సిరీస్ ను గెలుచుకుంది. 2023 తర్వాత భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోకపోవడం విశేషం.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (సి), రింకు సింగ్, జితేష్ శర్మ(w), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (సి), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (w), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా


